తెలంగాణ

telangana

ETV Bharat / international

నానో రేణువులతో కొవిడ్‌ టీకా.. భవిష్యత్​ మహమ్మారులకూ చెక్‌! - covid tika for future pandamics

Nanoparticle Vaccines: భవిష్యత్‌లో వచ్చే ఇతర సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేలా నానో రేణువుల ఆధారంగా సరికొత్త కొవిడ్​ టీకాను కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఈ టీకా పొందిన ఎలుకలు చాలా సమర్థంగా కొవిడ్‌ను ఎదుర్కొన్నట్లు పరిశోధనలో వెల్లడైందని చెప్పారు.

covid vaccine news
వ్యాక్సిన్

By

Published : Mar 27, 2022, 6:55 AM IST

Nanoparticle Vaccines: కొవిడ్‌-19 కట్టడికి అమెరికా శాస్త్రవేత్తలు వినూత్న టీకాను అభివృద్ధి చేశారు. నానో రేణువుల ఆధారంగా తయారైన ఈ వ్యాక్సిన్‌లో స్వల్ప మార్పులు చేస్తే.. భవిష్యత్‌లో వచ్చే ఇతర సాంక్రమిక వ్యాధులనూ లక్ష్యంగా చేసుకోవచ్చు. వీటిని పొందిన ఎలుకలు చాలా సమర్థంగా కొవిడ్‌ను ఎదుర్కొన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

ఏమిటీ వ్యాక్సిన్‌?:సాధారణంగా వైరల్‌ టీకాల్లో వైరస్‌కు సంబంధించిన రేణువులు(యాంటిజెన్లు) ఉంటాయి. వీటిని లక్ష్యంగా చేసుకునేలా మన రోగ నిరోధక వ్యవస్థ తర్ఫీదు పొందుతుంది. తర్వాతి కాలంలో ఈ లక్ష్యం(వైరస్‌ రేణువులు) తారసపడితే.. దాన్ని ఎదుర్కొనేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించే ‘అడ్జువెంట్ల’నూ వ్యాక్సిన్లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల రూపకల్పనలో శాస్త్రవేత్తలు ఈ రెండు రకాల పదార్థాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీటిని నిర్దిష్ట ఆకృతుల్లో అమర్చి, శరీరంలోకి ప్రవేశపెట్టే అంశానికి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దానికి భిన్నంగా ఆకృతి (స్ట్రక్చర్‌)కి ప్రాధాన్యం ఇచ్చే వ్యూహాన్ని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. వీటిని స్పెరికల్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ (ఎస్‌ఎన్‌ఏ) వ్యాక్సిన్లుగా పేర్కొంటున్నారు.

ఎస్‌ఎన్‌ఏ అంటే?: ఇది ఒకరకమైన గ్లోబ్యులార్‌ డీఎన్‌ఏ. సూక్ష్మ నానో రేణువు రూపంలో ఉంటుంది. దీని కోర్‌ భాగంలో వైరస్‌కు సంబంధించిన లక్షిత భాగాన్ని ఉంచుతారు. దాని పై పొరను అడ్జువెంట్‌లా తీర్చిదిద్దుతారు. ఈ టీకాలు రోగ నిరోధక కణాలను అత్యంత సమర్థంగా ప్రేరేపిస్తాయని పరిశోధకులు తెలిపారు.

  • ఎస్‌ఎన్‌ఏలను 60 రకాల కణాలపై పరీక్షించారు. రొమ్ము క్యాన్సర్‌ ఉన్న ఎలుకల చికిత్సకు ఎస్‌ఎన్‌ఏలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇతర రకాల క్యాన్సర్లకూ ఈ తరహా టీకాలు రూపొందుతున్నాయి.
  • సాంక్రమిక వ్యాధులకూ.:క్యాన్సర్‌ చికిత్సకు ఈ విధానాన్ని వాడినప్పటికీ సాంక్రమిక వ్యాధులపై దీన్ని పరీక్షించలేదు. అమెరికా శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. యాంటిజెన్‌, అడ్జువెంట్‌ను ఒక నానోరేణువులో ఇవ్వడం ద్వారా సాంక్రమిక వ్యాధులకు సమర్థ వ్యాక్సిన్లు తయారు చేయవచ్చని తేల్చారు.
  • కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌తో కూడిన యాంటిజెన్‌ను ఎస్‌ఎన్‌ఏ కోర్‌ భాగంలో ఉంచారు.
  • డీఎన్‌ఏకు సంబంధించిన ఒక నిర్దిష్ట క్రమాన్ని అడ్జువెంట్‌గా వాడారు. దీన్ని కోర్‌ భాగం చుట్టూ పొరలా ఉపయోగించారు.
  • ఎలుకలపై ప్రయోగం..:ఎస్‌ఎన్‌ఏ టీకాను కొన్ని ఎలుకలపై ప్రయోగించారు. మరికొన్ని మూషికాలకు ఈ రెండు పదార్థాలతో కూడిన సెలైన్‌ ద్రావణాన్ని ఇచ్చారు. రెండు వారాల తర్వాత.. మిగతా మూషికాలతో పోలిస్తే ఎస్‌ఎన్‌ఏ టీకాలు పొందిన జీవుల్లో భారీగా యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి.
  • కరోనా వైరస్‌ను ఈ టీకా ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నది పరీక్షించారు. వ్యాక్సిన్‌ పొందిన ఎలుకలు అధిక మోతాదులో కరోనా వైరస్‌ను తట్టుకొన్నాయి. మిగతా ఎలుకలు 14 రోజుల్లో మృత్యువాత పడ్డాయి.

భవిష్యత్‌ వ్యాధులు లక్ష్యంగా..:ప్రస్తుత కొవిడ్‌ టీకాలతో పోటీ పడటం ఈ పరిశోధన ఉద్దేశం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాలో తదుపరి వచ్చే ప్రమాదకర వేరియంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నామని వివరించారు. ఈ టీకాల్లో చాలా వేగంగా మార్పులు చేసి, కొత్త వైరస్‌లపైకి ప్రయోగించొచ్చని తెలిపారు.

  • దుష్ప్రభావాలు తక్కువ:సాధారణ వ్యాక్సిన్లతో పోలిస్తే ఎస్‌ఎన్‌ఏ టీకాలతో దుష్ప్రభావాలు చాలా తక్కువ.
  • సాధారణ ఫ్రిజ్‌లో వీటిని నిల్వ చేయవచ్చు.
  • వీటివల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

ఇదీ చదవండి:'పుతిన్​కు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదు'

ABOUT THE AUTHOR

...view details