Aung San Suu Kyi news: మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్‌సాన్ సూకీ(77)కి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన 'డా ఖిన్ క్యీ' ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేశారంటూ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని రాయితీ ధరకు లీజుకు తీసుకున్నట్లు తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరవాత సూకీని గతేడాది ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతో పాటు పలువురు నేతలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సూకీని నిర్బంధంలోనే ఉంచి ఆమెపై పలు కేసులు మోపుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు జైలు శిక్షలు కూడా విధించారు.