Suu Kyi Myanmar : ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన కేసులో మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీకి మూడేళ్ల జైలు శిక్షను విధించింది ఆ దేశ కోర్టు. అయితే ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. శుక్రవారం విధించిన శిక్ష దానికి అదనం కానుంది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీకి చెందిన సూకీ భవిష్యత్తు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సైన్యం హామీ ఇచ్చినా.. సూకీ జైలు శిక్షతో ఆ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది.
2020 జనరల్ ఎన్నికల్లో సూకీ పార్టీ విజయం సాధించింది. అయితే 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన సూకీ పార్టీ నుంచి అధికారాన్ని సైన్యం లాగేసుకుంది. ఎన్నికల సమయంలో హెచ్చు స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సూకీపై ఆరోపణలు వచ్చాయి. అయితే సూకీతో పనిచేసిన మాజీ సీనియర్ సభ్యుల్ని ఈ కేసులో సైన్యం అరెస్టు చేసింది.
శ్రీలంకకు గొటబాయ!
Gotabaya Rajapaksa: పెల్లుబికిన ప్రజాగ్రహంతో శ్రీలంకను వీడి, పలు దేశాల్లో తల దాచుకొన్న మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (73) థాయిలాండ్ నుంచి స్వదేశానికి తిరిగిరానున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల (రూ.23,114 కోట్లు) రుణసాయం అందించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) గురువారం ప్రకటించింది.