అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్‌లో 19 ఏళ్ల ఎజెకిల్ కెల్లీ అనే యువకుడు ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ, కారులో నగరమంతా తిరుగుతూ ఏడుచోట్ల కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ విధ్వంసం రాత్రి వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
నిందితుడు ఓ మహిళను హత్య చేసి.. ఆమె నుంచి టయోటా కారును స్వాధీనం చేసుకున్నాడు. ఈ దాడి దృశ్యాలన్నింటినీ ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాడు. నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుండడం వల్ల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫిస్ క్యాంపస్ సమీపంలోనే కాల్పులు జరిగాయని అక్కడి విద్యార్థులను అప్రమత్తం చేశారు. విశ్వవిద్యాలయానికి 4 మైళ్ల దూరంలో ఉన్న రోడ్స్ కళాశాలలో విద్యార్థులను ఆశ్రయం పొందమని, స్థానికులు ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచించారు. చివరకు నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు.