నెదర్లాండ్‌కు చెందిన ఓ నిపుణుడు ప్రత్యేకమైన దిండును తయారు చేశాడు. ఈ అధునాతన దిండు తయారీలో నీలమణి, వజ్రాలు, బంగారం, మల్బరీ సిల్క్‌తో పాటు పలు విలువైన వస్తువులను వినియోగించినట్లు రూపకర్త థిజ్ వాన్ డెర్ హిల్ట్స్ వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన దిండును తయారీకి ఏకంగా 15 ఏళ్లపాటు కృషి చేసినట్లు తెలిపాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇదేనని.. ఈ దిండు ప్రారంభ ధర 57వేల డాలర్లుగా (దాదాపు రూ.45లక్షలు) నిర్ణయించాడు.
ఈ దిండుకు సంబంధించిన విశేషాలు, వివరాలను tailormadepillow.comలో పంచుకున్నాడు. తయారీ విధానాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. ఈజిప్టు పత్తి, మల్బరీ సిల్క్‌తో ఈ అధునాతన దిండును రూపొందించారు. ఇది విషరహిత ఫోమ్‌తో నిండి ఉంటుంది. దిండు పైభాగంలో 22.5 క్యారెట్ల నీలమణి, నాలుగు వజ్రాలను అమర్చారు. సురక్షిత, ఆరోగ్యకరమైన నిద్ర కోసం.. విద్యుదయస్కాంత వికిరణాలను నిరోధించేలా దిండుపై 24 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించారు. నిద్రలేమితో బాధపడుతున్నవారు ప్రశాంతంగా నిద్రపోవడానికి దిండు ఎంతగానో సహాయపడుతుందని రూపకర్త పేర్కొన్నారు. 'హైటెక్ సొల్యూషన్స్, పాతకాలపు హస్తకళ మేళవింపు ద్వారా టైలర్‌మేడ్ పిల్లో అత్యంత వినూత్నమైనది, అన్నింటికంటే ప్రత్యేకమైనది' అని వెబ్‌సైట్‌లో తెలిపారు.