Morocco Earthquake 2023 :ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించగా.. దాదాపు 296 మంది చనిపోయారు. 153 మందికి పైగా గాయపడ్డారు. బాధితులంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఈ విపత్తు సంభవించింది. యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు పొందిన మర్రకేచ్ నగరానికి దక్షిణంగా.. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాస్ పర్వతాలలో భూకేంద్రాన్ని గుర్తించారు అధికారులు. 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మొరాకో భూకంప సంస్థ మాత్రం 8 కిలోమీటర్ల లోతులోనే సంభవించినట్లు పేర్కొంది.
Morocco Earthquake 2023 :భూకంప ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు పట్టణాలు, వివిధ ప్రాంతాల్లోని భవనాలు భారీగా దెబ్బతిన్నట్లు వారు వివరించారు. భూకంపానికి సంబంధించిన వీడియోలను 'ఎక్స్'లో షేర్ చేశారు మొరాకన్లు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భవనాలు కూలడం, దుమ్ము రేగడం వీటిలో మనం చూడొచ్చు. నిర్మాణాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీయడం, అరవడం గమనించవచ్చు. భూప్రకంపనల అనంతరం తిరిగి భవనాల్లోకి వెళ్లకుండా జనాలంతా వీధుల్లోనే గుమిగూడారాని స్థానికులు తెలిపారు.