Morocco Earthquake 2023 : ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 2,012కు పెరగ్గా, గాయపడిన వారి సంఖ్య 2,059కు చేరింది. శిథిలాల కింద పెద్దసంఖ్యలో ప్రజలు చిక్కుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి.. గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మకరేష్‌కు చుట్టు ఉన్న ప్రహరీ గోడకు తీవ్ర నష్టం వాటిల్లింది.12 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియా సైతం దెబ్బతింది. భూకంప తీవ్రతకు రహదారులు భారీగా ధ్వంసమయ్యాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు రెస్క్యూ సిబ్బందికి ఆటంకం ఎదురవుతోంది. ఊహించని భూకంప విపత్తును ఎదుర్కొనేందుకు.. సైన్యాన్ని రంగంలోకి దించారు మొరాకో రాజు. క్షేత్రస్థాయిలో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. ఘటనలో వేల మంది నిరాశ్రయిలయ్యారు. చాలా మంది ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళుతున్నారు. మృతులకు నివాళిగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది మొరాకో ప్రభుత్వం.
సాయానికి ముందుకొచ్చిన పలు దేశాలు..
మొరాకోకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయిల్ కూడా మొరాకోకు సాయ పడడానికి ముందుకొచ్చింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. అవసరమైన సాయాన్ని మొరాకోకు అందిస్తామని ప్రకటించారు. మొరాకోలో ఉన్న అమెరికన్ల గురించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ కూడా మొరాకోకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఖతార్ కూడా మొరాకో ఘటనపై సానుభూతి వ్యక్తం చేసింది. బాధితులను కాపాడేందుకు అక్కడికి పోలీసులను పంపించింది. జోర్డాన్ సైతం సాయం ప్రకటించింది.