తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా రాజకీయాల్లో కలకలం.. బైడెన్‌ వద్ద మరిన్ని రహస్య పత్రాలు.. - Former US President Barack Obama

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన మరో ప్రాంతంలో మరిన్ని రహస్య ప్రతాలు బయటపడటం అగ్రరాజ్య రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల ఆయన పాత కార్యాలయంలో అత్యంత రహస్య పత్రాలు బయటపడటం వివాదాస్పదంగా మారాయి. తాజాగా మరికొన్ని పత్రాలు వెలువడ్డాయి.

more-secret-documents-at-us-president-joe-biden
బైడెన్‌ వద్ద మరిన్ని రహస్య పత్రాలు

By

Published : Jan 12, 2023, 2:15 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరింత సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇటీవల ఆయన పాత కార్యాలయంలో అత్యంత రహస్య పత్రాలు బయటపడటం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బైడెన్‌కు చెందిన మరో కార్యాలయంలో ఇంకొన్ని రహస్య పత్రాలను ఆయన న్యాయబృందం గుర్తించడం కలకలం రేపుతోంది.
బైడెన్‌కు చెందిన మరో ప్రాంతంలో అదనపు రహస్య ప్రతాలను అధ్యక్షుడి న్యాయబృందం గుర్తించిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ వ్యక్తి చెప్పినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ, వీటిని ఎక్కడ, ఎప్పుడు కనుగొన్నారు..? ఆ పత్రాల్లో ఎలాంటి సమాచారం ఉంద్న విషయాలను మాత్రం సదరు వ్యక్తి బయటపెట్టలేదట. అయితే, రెండో విడత దొరికిన రహస్య పత్రాలపై శ్వేతసౌధం నుంచి గానీ, న్యాయశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే తొలి బ్యాచ్‌ పత్రాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కెరిన్‌ జీన్‌ పెర్రీ ప్రకటన చేసిన కొద్ది గంటలకే రెండో ప్రాంతంలో రహస్య పత్రాలు బయటపడటం గమనార్హం. బుధవారం కెరిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. "రహస్య పత్రాల ఘటనపై సరైన దశలో విచారణ చేపట్టేందుకు శ్వేతసౌధం కట్టుబడి ఉంది" అని తెలిపారు. అయితే, దీనిపై బైడెన్ ఎప్పుడు ప్రకటన చేస్తారు? ఇతర అనధికారిక ప్రాంతాల్లో ఇంకా ఏమైనా రహస్య పత్రాలను గుర్తించారా? అన్న విషయాలను ఆమె వెల్లడించలేదు. అంతేగాక, నవంబరు 2నే ఈ పత్రాలను బయటపడినప్పటికీ.. శ్వేతసౌధం ఎందుకు ఆలస్యం చేసిందన్నదానిపైనా ఆమె వివరణ ఇవ్వలేదు.

బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోని కొన్ని రహస్య పత్రాలు.. నాటి ఉపాధ్యక్షుడైన జో బైడెన్‌ ఉపయోగించిన ఓ కార్యాలయంలో బయటపడటం అమెరికాలో సంచలనం రేపుతోంది. వాషింగ్టన్‌ డీసీలోని పెన్‌ బైడెన్‌ సెంటర్‌లోని కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడానికి అక్కడున్న బీరువాలో ఫైళ్లను అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులు ప్యాక్‌ చేస్తుండగా ఇవి బయటపడ్డాయి. 2017 మధ్య నుంచి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకూ ఈ కార్యాలయాన్ని బైడెన్‌ వాడుకున్నారు. ఈ పత్రాలు గతేడాది నవంబరు 2నే బయటపడగా.. అప్పుడే నేషనల్‌ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చామని బైడెన్‌ న్యాయబృందం వెల్లడించింది. అయితే, ఈ పత్రాల్లో ఉక్రెయిన్‌, ఇరాన్‌, యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details