తెలంగాణ

telangana

ETV Bharat / international

'స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ సంక్రమణ'

Monkeypox virus disease: ప్రధానంగా కోతుల్లోనే కనిపించే మంకీపాక్స్​ వైరల్‌ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా వెళ్లిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా అది సోకుతుంది. ఇటీవల స్పెయిన్‌, బెల్జియంలలో జరిగిన రెండు రేవ్‌ పార్టీలలో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Monkeypox
మంకీపాక్స్​ వైరల్‌ వ్యాధి

By

Published : May 24, 2022, 9:01 AM IST

Monkeypox virus disease: మంకీపాక్స్‌ వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా మసలిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్‌ ఆరోగ్య రక్షణ సంస్థ సోమవారం సూచించింది. మంకీపాక్స్‌ వ్యాధిగ్రస్తునితో ఇంట్లో కానీ, వెలుపల కానీ సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసిందీ సంబంధిత అధికారులకు తెలపాలనీ పేర్కొంది. అటువంటి వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని ఆ సంస్థ సలహా ఇచ్చింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్‌లకు పాకింది. బ్రిటన్‌లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్‌ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా వెళ్లిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా అది సోకుతుంది. ఇటీవల స్పెయిన్‌, బెల్జియంలలో జరిగిన రెండు రేవ్‌ పార్టీలలో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్‌ డేవిడ్‌ హైమాన్‌ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి. అలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా, పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా, ఇతరత్రా దగ్గరకు వెళ్లినా మంకీపాక్స్‌ సోకుతుంది.

ఇవీ లక్షణాలు:
అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు మంకీపాక్స్‌ లక్షణాలు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది. పిల్లల్లో మాత్రం తీవ్రత ఎక్కువ. సాధారణ జనాభాకు ఈ వ్యాధి వల్ల ప్రమాదం తక్కువే. అయినప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండటం మంచిదని బ్రిటన్‌ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధానాధికారి సూజన్‌ హాప్కిన్స్‌ సలహా ఇచ్చారు. మంకీపాక్స్‌ కోవిడ్‌ లాంటిది కాదనీ, అది గాలి ద్వారా వ్యాపించదనీ, దాన్ని కట్టడి చేసే టీకాలు మనవద్ద ఉన్నాయని డాక్టర్‌ హైమాన్‌ పేర్కొన్నారు.

మశూచి టీకాతో రక్షణ:
మంకీ పాక్స్‌ వ్యాధిగ్రస్తులకు సమీపంగా వెళ్లిన వారికి మశూచి టీకాలు ఇస్తున్నారు. లక్షణాలు కనిపించిన నాలుగైదు రోజుల్లో టీకా ఇస్తున్నందున వారికి మంకీపాక్స్‌ నుంచి రక్షణ లభిస్తోంది. ప్రస్తుతానికి జనాభా అంతటికీ మశూచి టీకాలు ఇవ్వడం లేదని బ్రిటన్‌ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధానాధికారి సూజన్‌ హాప్కిన్స్‌ చెప్పారు. మశూచి టీకాలు మంకీపాక్స్‌ నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తున్నందున అనేక దేశాలు ఆ టీకాలను నిల్వచేయనారంభించాయి.

ఇదీ చూడండి:క్యాన్సర్​ను వేటాడే వైరస్​ల సృష్టి.. శాస్త్రవేత్తల ఘనత

ABOUT THE AUTHOR

...view details