Modi US Visit 2023 : ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులపాటు అమెరికాలో విసృతంగా పర్యటించారు. మొదట అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు శ్వేతసౌధానికివెళ్లారు. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలను ఖరారు చేశారు.
శుక్రవారం శ్వేతసౌధంలోరెండు దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల CEOలతో ఆయన ముచ్చటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదళ్ల, యాపిల్ CEO టిమ్ కుక్, గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్‌మన్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ వంటి అమెరికా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
PM Modi US Tour : భారత్-అమెరికా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు మరింత స్వేచ్ఛాయుత, భద్రమైన, సాధికారతకు భరోసా ఇస్తుందని బైడెన్ చెప్పారు. బైడెన్ విజన్, సామర్థ్యాలు, భారత ఆకాంక్షలు.. గొప్ప అవకాశాలు సృష్టిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్ నైపుణ్యాలు, అమెరికా అధునాతన సాంకేతికత కలిస్తే ప్రపంచానికి మరింత మెరుగైన భవిష్యత్‌ను అందించవచ్చని తెలిపారు. హైటెక్ రంగంలో భారత్, ఆమెరికా బంధం మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు.
తర్వాత జాన్ ఎఫ్.కెన్నెడి సెంటర్‌లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. భారత్ బలపడినప్పుడల్లా ప్రపంచానికి మేలు జరిగినట్లు చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచానికి ఔషధాలు అవసరమైనప్పుడు.. భారత్ ఉత్పత్తిని పెంచి మందులు సరఫరా చేసినట్లు తెలిపారు. భారత్ విజయాలకు, అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలే.. అతిపెద్ద చోదకశక్తి అని కొనిడాయారు. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు భారత్‌లో 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు.
"ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలిసే ఉంటుంది. అధిక వృద్ధిరేటు, తక్కువ ద్రవ్యోల్బణం సాధించడం అంత సులభం ఏమీ కాదు. కానీ భారత్ దానిని కూడా చేసి చూపుతోంది. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూనే మూలధన పెట్టుబడులను క్రమంగా పెంచుతున్నాం. మా ఎగుమతులు పెరుగుతున్నాయి. విదేశీ మారక నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు 16 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి."