తెలంగాణ

telangana

ETV Bharat / international

'తొలిసారి శ్వేతసౌధం ద్వారాలు తెరచుకున్నాయి'.. బైడెన్​కు థ్యాంక్స్ చెప్పిన మోదీ

Modi US meet : అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ను కలిశారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు ఇరువురు మీడియాతో మాట్లాడారు. భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. తొలిసారి వారి కోసం శ్వేతసౌధ ద్వారాలు తెరచుకున్నాయని చెప్పారు.

modi-us-meet
modi-us-meet

By

Published : Jun 22, 2023, 8:32 PM IST

Updated : Jun 23, 2023, 6:23 AM IST

Modi US meet : భారత్- అమెరికా మధ్య భాగస్వామ్యం 21 శతాబ్దంలో నిర్ణయాత్మక సంబంధంగా నిలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మోదీ సహకారంతో క్వాడ్​ను బలోపేతం చేశామని గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్​కు క్వాడ్ కీలకమని చెప్పారు. మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు మాట్లాడిన ఆయన.. ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్ పనిచేసిందనే విషయాన్ని భవిష్యత్ తరాలు గుర్తిస్తాయని అన్నారు. పేదరిక నిర్మూలన విషయంలో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్నాయని బైడెన్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం; వాతావరణ మార్పులపై పోరాడటం; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తలెత్తిన ఆహార, ఇంధన అభద్రతను తొలగించడం వంటి అంశాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్​ను నిర్ణయిస్తాయని అన్నారు.

బైడెన్-మోదీ

'తొలిసారి శ్వేతసౌధం ద్వారాలు తెరుచుకున్నాయి'
Modi us visit 2023 : బైడెన్ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ అనంతర యుగంలో ప్రపంచం కొత్తరూపు సంతరించుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్-అమెరికా మధ్య స్నేహం కీలకంగా మారుతుందని ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ భారత్, అమెరికా భుజం భుజం కలిపి నడుస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. సముద్రం నుంచి అంతరిక్షం వరకు.. ప్రాచీణ సంస్కృతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని రంగాల్లో ఇరుదేశాలు దీటుగా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భారతీయ అమెరికన్ల కోసం తొలిసారి శ్వేతసౌధం ద్వారాలు తెరచుకున్నాయని అన్నారు.

"భారత ప్రధాని అయిన తర్వాత నేను శ్వేతసౌధాన్ని చాలా సార్లు సందర్శించా. కానీ, ఈ స్థాయిలో భారతీయ- అమెరికన్ల కోసం శ్వేతసౌధ ద్వారాలు తెరచుకోవడం మాత్రం ఇదే తొలిసారి. భారత సంతతి ప్రజలు కష్టపడి, నిబద్దతతో పని చేస్తూ అమెరికాలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు మీరే ప్రధాన బలం. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు బైడెన్ దంపతులకు ధన్యవాదాలు చెబుతున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారత సంతతి ప్రజల సందడి
Modi US visit live : కాగా, మోదీకి ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున భారత సంతతి ప్రజలు శ్వేతసౌధం వద్దకు చేరుకున్నారు. శ్వేతసౌధం లాన్​లో నిల్చొని 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేశారు. భారత్- అమెరికా జాతీయ జెండాలు పట్టుకొని సందడి చేశారు.

బుధవారం మోదీకి శ్వేతసౌధంలోకి స్వాగతం పలికారు బైడెన్ దంపతులు. ఈ సందర్భంగా వారిద్దరికీ ప్రత్యేక కానుకలు అందించారు మోదీ. బైడెన్​కు చందనపు చెక్కతో తయారు చేసిన పెట్టను ఇచ్చారు. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు చేసిన ఈ పెట్టెలో గణేషుడి ప్రతిమ, వెండితో రూపొందించిన దీపపు ప్రమిద ఉన్నాయి. అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు 7.5 క్యారట్ల పచ్చ వజ్రాన్ని.. మోదీ కానుకగా అందజేశారు.

మోదీతో ముచ్చటిస్తున్న బైడెన్

ఈ 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్‌లో రూపొందించారు. ఒక క్యారెట్‌ తయారీకి కేవలం 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదలవుతుంది. దీన్ని జెమోలాజికల్‌ ల్యాబ్‌ కూడా ధ్రువీకరించింది. వజ్రానికి ఉండే నాలుగు ప్రధాన లక్షణాలైన.. కట్‌, కలర్‌, క్యారెట్‌, క్లారిటీలను కలిగి ఉంది. భూమిలో లభించే సహజమైన వజ్రం మాదిరిగానే దీనికి రసాయన, ఆప్టికల్ లక్షణాలు ఉంటాయి. మరోవైపు, బైడెన్ సైతం మోదీకి ప్రత్యేక వస్తువులను కానుకగా అందించారు. పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్‌ బహూకరించారు.

మోదీ బహూకరించిన డైమండ్ రింగ్
మోదీ బహూకరించిన పెట్టె
Last Updated : Jun 23, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details