Modi JinpingBRICS: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ-LAC వెంబడి "పరిష్కారం కాని" సమస్యలపై భారత్ ఆందోళనలను జిన్‌పింగ్‌కు ప్రధాని తెలియజేసినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని జిన్‌పింగ్‌తో మోదీ పేర్కొన్నారని వినయ్ క్వాత్రా చెప్పారు.
'సాధారణ పరిస్థితుల కోసం అవి ముఖ్యం'
Modi Meets Jinping : భారత్, చైనా మధ్య సాధారణ పరిస్థితుల కోసం సరిహద్దులో శాంతి, ప్రశాంతత ముఖ్యమని మోదీ చెప్పినట్లు క్వాత్రా వివరించారు. వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య నిర్మాణాత్మక ద్వైపాక్షిక సమావేశం జరగలేదని తెలుస్తోంది. శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశానికి ముందు ఇరుదేశాల అధినేతలు కాసేపు మాట్లాడుకున్నారు. దక్షిణాఫ్రికా మీడియా ఈ వీడియోను ప్రసారం చేసింది.
'సంబంధాలు మెరుగుపడితే ఇరు దేశాలకు ఉపయోగమే!'
మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణ వివరాలను దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే.. ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని జిన్‌పింగ్.. మోదీకి చెప్పినట్లు పేర్కొంది. మోదీ- జిన్‌పింగ్ మధ్య సంభాషణను లోతైనదిగా చైనా ఎంబసీ అభివర్ణించింది.
"చైనా-భారత్ మధ్య సంబంధాలతో పాటు ఇతర అంశాలపై ఇరు దేశాల నేతలు.. నిజాయతీగా లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు" అని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు కృషి చేయాలని కోరింది.
ఇండోనేసియాలో..
Modi Jinping Meeting : ఇండోనేసియాలోని బాలిలో గత నవంబర్‌లో జరిగిన జీ-20 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. విందు సందర్భంగా కాసేపు మాట్లాడుకున్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొంది. భారత్‌లో వచ్చే నెలలో జరగనున్న జీ-20 సమావేశానికి జిన్‌పింగ్‌ను ప్రధాని ఆహ్వానించారా లేదా అన్న విషయంపై విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టతనివ్వలేదు.
ముగిసిన మారథాన్ చర్చలు..
India China Border Meeting : మరోవైపు, లద్దాఖ్‌లోని దెప్సాంగ్ పెయిన్స్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించకునేందుకు భారత్, చైనా ఆర్మీ అధికారుల మధ్య జరిగిన ఆరు రోజుల మారథాన్ చర్చలు ముగిశాయి. "చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై విస్తృతమైన చర్చలు జరిపిన తర్వాత ఇరుపక్షాలు సుదీర్ఘ చర్చలను ముగించాయి" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతి త్వరలో సీనియర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.
జిన్‌పింగ్ అయోమయం!
Jinping Viral Video : అయితే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న చైనా అధినేత జిన్‌పింగ్‌కు.. అక్కడి ఓ సభా ప్రాంగణంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. తన వెంట వస్తున్న సహాయకుడిని అక్కడి భద్రతా సిబ్బంది బలవంతంగా అడ్డుకోవడం వల్ల.. ఏం జరుగుతుందో తెలియక ఆయన కొద్దిసేపు అయోమయానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అసలేం జరిగందంటే?
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ ఓ హాల్ వైపు నడుచుకుంటూ బయల్దేరారు. మార్గమధ్యలో చైనా ప్రతినిధి ఆయన్ను అనుసరించేందుకు యత్నించారు. కానీ, ఆ హాలు ప్రవేశ ద్వారం వద్ద అక్కడి భద్రతాసిబ్బంది ఆ ప్రతినిధిని అడ్డుకున్నారు. బలవంతంగా అతడిని నిరోధిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. ఇది గమనించిన జిన్‌పింగ్ కాస్త ఇబ్బందిగా ముందుకెళ్లినట్టు కనిపించింది. అంతలోనే కొద్దిసేపు నిలబడిపోయారు. ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో.. వెనక్కు తిరిగి చూశారు. చివరకు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. అయితే, చైనా ప్రతినిధిని ఎందుకు అడ్డుకున్నారో తెలియరాలేదు.