INS Kirpan Gifted To Vietnam : ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా వియత్నాంకు.. భారత్ ఐఎన్ఎస్ కృపాణ్ అనే యుద్ధనౌకను కానుక ఇచ్చింది. వియత్నాం పర్యటనలో ఉన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఓ ప్రత్యేక కార్యక్రమంలో వియత్నాం పీపుల్స్ నేవీకి యుద్ధనౌకను అప్పగించారు. సేవలందించే ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని నౌకాదళం వెల్లడించింది.
INS Kirpan UPSC : దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను వియత్నాంకు అప్పగించడం.. స్నేహపూర్వక దేశాలకు సాయం చేయడం సహా వారి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ కట్టుబడి ఉంటుందనే విషయాన్ని చాటుతుందని నౌకాదళం తెలిపింది. భారత నౌకాదళంలో 32 ఏళ్ల పాటు సేవలందించిన ఈ యుద్ధనౌకను.. వియత్నాంకు కానుకగా ఇవ్వనున్నట్లు గతనెలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ గిల్లికజ్జాలకు పాల్పడుతున్న చైనా దూకుడును అడ్డుకునేలా భారత్, వియత్నాంలు చేయీచేయీ కలుపుతున్నాయనడానికి తాజా పరిణామం నిదర్శనం.
INS Kirpan Built By : ఐఎస్ఎస్ కృపాణ్‌ను 1991లో ప్రారంభించారు. దేశీయంగా ఈ ఖుక్రీ-తరగతి క్షిపణి యుద్ధనౌక (Corvett)ను దేశీయంగా తయారు చేశారు. దాదాపు 12 మంది అధికారులు, 100 మంది నావికులు ఇందులో పనిచేస్తారు. ఈ యూద్ధనౌక 90 మీటర్ల పొడవు, 10.45 మీటర్ల వెడల్పు, 1,450 టన్నుల బరువు కలిగి ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐఎన్ఎస్ కృపాణ్ భారత్ నుంచి జూన్ 28న విశాఖపట్నం నుంచి బయలుదేరి.. వియత్నాంలోని కామ్ రాన్‌కు జులై 8న చేరుకుంది. నౌకలో వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బందికి శిక్షణ అందజేశారు. భారత్ గతంలోనూ మయన్మార్, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాలకు యుద్ధనౌకలను బహుమతిగా అందజేసింది.
చైనాపై భారత్‌కు వియత్నాం ఫిర్యాదు..
India Vietnam Relations : గతంలో చైనా ఆగడాలపై భారత్‌కు వియత్నాం ఫిర్యాదు చేసింది. 2020లో దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాంబర్‌ను డ్రాగన్ మోహరించింది. అనంతరం అక్కడి ప్రశాంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో భారత్‌లో వియత్నాం రాయబారి ఫామ్ సన్ చౌ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. చైనా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని వియత్నాం భారత్‌కు తెలిపింది. ఆ ప్రాంతంలో పరిస్థితులను డ్రాగన్ ఉద్రిక్తంగా మార్చిందని వెల్లడించింది. మన రెండు దేశాల మధ్య వ్యూహత్మర రక్షణ సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ కథనం పూర్తిగా చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.