United States Army Emails : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్ రష్యా మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయి. దీనంతటికీ ఒక టైపింగ్ తప్పు కారణమైంది. సాధారణంగా అమెరికా సైన్యం తమ బృందాలతో కమ్యూనికేషన్ల కోసం .MIL అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న డొమైన్ వాడుతుంది. కానీ, చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్ చేసే సమయంలో పొరపాటున .ML అని టైపు చేసేవారు. దీంతో ఆ మెయిల్స్ మొత్తం మాలి డొమైన్‌కు వెళ్లిపోయాయి. వీటిల్లో అమెరికా ఆర్మీ చీఫ్ పర్యటనలో బసచేసే హోటల్ గది నంబర్ల వంటివి కూడా ఉండడం గమనార్హం.
US Army Emails Mali : అమెరికాకు చెందిన ఈమెయిల్స్.. మాలికి వెళ్లాయని జోహన్నస్ జూర్బిర్ అనే డచ్ వ్యాపారవేత్త గుర్తించాడు. జూర్బిర్.. మాలి డొమైన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి అమెరికా సైన్యం నుంచి లక్షల సంఖ్యలో మెయిల్స్ వచ్చినట్లు అతడు తెలిపాడు. తొలుత తమ డొమైన్‌లో లేని మెయిల్ అడ్రస్‌లకు కూడా .ML ఎక్స్‌టెన్షన్‌తో మెయిల్స్ రావడాన్ని గమనించాడు. ఆ తర్వాత ఇవి పొరబాటున వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఇటువంటి మెయిల్స్‌ను ఓ చోటకు చేర్చడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇటువంటివి 1,17,000 ఈమెయిల్స్ వచ్చాయి. వీటిల్లో అమెరికా సైన్యానికి చెందిన మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, సైనికుల మెడికల్ రికార్డులు, స్థావరాల ఫొటోలు, స్థావరాల్లో సిబ్బంది సంఖ్య, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు, పన్ను వివరాలు వంటి కీలకమైన సమాచారం కూడా ఉంది. మెయిల్స్ దారి మళ్లుతున్న విషయంపై జోహన్నస్ జూర్బిర్ చాలా సార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.