Mexico Aliens Display : మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించిన వేల ఏళ్ల నాటి ఏలియన్ల అవశేషాలు పూర్తిగా అవాస్తవమని తేల్చారు మెక్సికోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు జూలియాటా ఫియరో. మానవులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధరించడానికి ఎక్స్ కిరణాల కంటే అధునాతనమైన సాంకేతికత అవసరమని తెలిపారు. మౌసాన్.. గ్రహాంతరవాసులతో మాట్లాడినట్లు కూడా చెబుతారని.. తాను వాటిని నమ్మనని తెలిపారు. ఆ అవశేషాలను పెరూ నుంచి సేకరించగా.. కనీసం ఆ దేశ రాయబారిని ఆహ్వానించకపోవడం వింతగా ఉందన్నారు.
Aliens Mexican Congress : అంతకుముందు మంగళవారం చట్టసభలో ఏలియన్ అవశేషాలను ప్రదర్శించారు జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో పార్లమెంట్లో తెరిచి చూపించారు. వంకర తలతో, కుచించుకోపోయిన శరీరంతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏళ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ చెప్పారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని.. అలాగే గుర్తు తెలియని ఎగిరే వస్తువు (UFO) శిథిలాల నుంచి కనుగొన్న జీవులు కూడా కాదని స్పష్టం చేశారు. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని తెలిపారు.
Aliens Mexican Parliament Display 2023 : మరోవైపు ఈ రెండు ఏలియన్స్ మృతదేహాలకు డీఎన్‌ఏ నమూనాలు పరీక్షించినట్లు మెక్సికో కాంగ్రెస్‌కు మౌసాన్ వివరించారు. ఇతర డీఎన్‌ఏ నమూనాలతో వీటిని పోల్చినట్లు చెప్పారు. అయితే వీటి డీఎన్‌ఏలో ఏమున్నది అన్నది 30 శాతానికిపైగా తెలియలేదన్నారు. ఎక్స్‌రే కూడా తీయగా అరుదైన లోహాలతోపాటు ఒక ఏలియన్ అవశేషాల్లో గుడ్లు వంటి వాటిని కనుగొన్నట్లు మౌసాన్ వెల్లడించారు. ఈ జీవులు మానవ పరిణామంతో సంబంధం లేదని చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల్లో ఇలాంటి జీవులు ప్రపంచంలోనే లేవని చూపిస్తున్నప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలన్నారు. అంతకుముందు 2017లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మౌసాన్.