Mayor marries alligator: మెక్సికోలోని ఓ నగర మేయర్.. మొసలిని సంప్రదాయబద్ధంగా వివాహమాడారు. వందల మంది అతిథుల మధ్య.. పెళ్లి కూతురు దుస్తుల్లో అందంగా ముస్తాబైన ఏడేళ్ల మొసలిని జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఓక్సాకా రాష్ట్రం సాన్ పెడ్రో హువామెలులాలోని ఓ మత్స్యకార గ్రామం ఇందుకు వేదికైంది. తన ప్రాంతంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఇలా చేసినట్లు తెలిపారు సాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సూసా.
మొసలిని వివాహమాడే సంప్రదాయం మెక్సికోలో చాలా పురాతనమైంది. మొసలిని వారు భూమాతగా, దేవతగా కొలుస్తారు. ఇలాంటి పెళ్లిళ్లను మనుషులకు, దేవతలకు మధ్య బంధంగా చూస్తారు. అందుకే.. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా గత గురువారం మొసలిని మనువాడారు విక్టర్. అలా అని ఈ పెళ్లిని ఏదో తూతూమంత్రంగా పూర్తి చేయలేదు. వధువు కోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందించారు. మొసలి నోటిని తాడుతో కట్టేసి, అందంగా అలంకరించారు. కొత్త బట్టల్లో మెరిసిపోతున్న మకరాన్ని ఇద్దరు జాగ్రత్తగా పట్టుకుని వీధుల్లో ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు.