తెలంగాణ

telangana

ETV Bharat / international

'కిరాయి' సైన్యాల పరాయి యుద్ధం.. రష్యా తరఫున రంగంలోకి 'వాగ్నర్​' గ్రూప్​! - ఆఫ్రికా సంక్షోభం

ఏ దేశ యుద్ధంలో ఆ దేశ సైన్యాలు పాల్గొంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కిరాయి సైన్యాలను రణరంగంలోకి దింపుతున్నాయి పలు దేశాలు. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధభూమిలోనూ కిరాయి సైన్యాలు పోరాడుతున్నాయి. సైనికులకు తోడుగా కిరాయి సైన్యాలు కూడా యుద్ధ రంగంలోకి దింపడం ఆధునిక యుద్ధతంత్రమని అంటున్నారు విశ్లేషకులు.

Mercenary army in Russia Ukraine war
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కిరాయి సైన్యాలు

By

Published : Oct 17, 2022, 8:43 AM IST

యుద్ధంలో రష్యా తరఫున ఎవరెవరు పోరాడుతున్నారు? ఉక్రెయిన్‌ తరఫున ఆయుధాలు పడుతున్నదెవరు?.. ఇదేం ప్రశ్న? ఎవరి దేశం తరఫున వారి సైన్యమే కదా పోరాడేది- అనుకుంటున్నారా! అక్కడే తప్పులో కాలేస్తామంతా! యుద్ధమనగానే ఆయా దేశాల సైన్యాలు పాల్గొనటం సాధారణం. కానీ.. సైనికులకు తోడుగా.. కిరాయి సైన్యాలు కూడా రంగంలోకి దిగి పోరాడటం ఆధునిక యుద్ధతంత్రం! మొన్నటి ఆఫ్గనిస్థాన్‌ యుద్ధంలో, సిరియా రణరంగంలో.. ఆఫ్రికాలోని అంతర్యుద్ధాల్లో.. చివరకు తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధభూమిలోనూ ఇదే జరుగుతోంది.

నిజానికి కిరాయి సైన్యాలు ఆధునికమేమీ కాదు. పురాతనకాలంలో రాజులు ఇతర రాజ్యాలు/ప్రాంతాల నుంచి కిరాయి సైనికులను పెంచి పోషించేవారు. ఇప్పుడా పద్ధతే మళ్లీ పునరావృతం అవుతోంది. యుద్ధంలో పాల్గొంటున్న వారికి కిరాయి సైనికులను సరఫరా చేసే ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్టు కంపెనీలు (పీఎంసీ), కాంట్రాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా విరివిగా పనిచేస్తున్నారు. అమెరికా సహా అనేక దేశాలు ఈ కిరాయి సైనికులను వాడుకుంటున్నాయి.

వివిధ దేశాల నుంచి ఈ కంపెనీలు సుశిక్షితులైన వారిని, మాజీ సైనికులను, ఆయుధాలతో అనుభవమున్నవారిని నియమించుకొని.. ఎవరు అడిగితే వారికి సేవలందిస్తుంటాయి. ఈ కిరాయి సైనికులకు దేశభక్తి, సిద్ధాంతరాద్దాంతాలంటూ ఏమీ ఉండవు. ఉండేదల్లా తామే కంపెనీకి పనిచేస్తున్నాం.. జీతం ఇస్తున్నవారు ఎవరి తరఫున పనిచేయాలంటున్నారనేదే కీలకం. సంక్షోభిత ప్రాంతాల్లోని అనేక ప్రభుత్వాలు, పెద్దపెద్ద కంపెనీలే కాకుండా ఐక్యరాజ్య సమితిలాంటి సంస్థలూ ఈ పీఎంసీల సేవల్ని రక్షణ కోసం వాడుకుంటున్నాయి.

2003లో ఇరాక్‌పై యుద్ధంలో, ఇటీవలిదాకా ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా పీఎంసీల ద్వారా కిరాయి సైనికులను వాడుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారు ఎరిక్‌ ప్రిన్స్‌ బ్లాక్‌వాటర్‌ పేరుతో ఓ పీఎంసీని ఏర్పాటు చేశారు. సిరియా, లిబియా, ఉక్రెయిన్‌, యెమెన్‌ల్లోని సంఘర్షణల్లో కూడా కిరాయి సైనికులది కీలక పాత్ర అంటారు. పశ్చిమాసియాను కిరాయి సైనికులకు స్వర్గంగా చెబుతుంటారు యుద్ధనిపుణులు. యెమన్‌లో ఇరాన్‌ మద్దతిస్తున్న హౌతిస్‌తో పోరాడటానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ వందల మంది కిరాయి సైనికులను పంపించింది. వీరిలో చాలామంది కొలంబియా, పనామా, ఎల్‌సాల్వెడార్‌, చిలీల నుంచి వచ్చిన వారంటారు. అమెరికా, బ్రిటన్‌ కిరాయి సైనికుల కంటే వీరు తక్కువ ధరకు పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కిరాయి సైన్యం అనేదిప్పుడు బిలియన్ల డాలర్ల వ్యాపారంగా మారి.. యుద్ధాలు, సంఘర్షణలను రావణకాష్ఠంగా సాగదీస్తోంది.

"వీరికి ఎలాంటి దేశభక్తి ఉండదు. జవాబుదారీతనం ఉండదు. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు. యుద్ధాలను, ఘర్షణలను కొనసాగించేలా ఎత్తుగడలు వేస్తారు. ఎందుకంటే ఎంత ఘర్షణ కొనసాగితే వారికంతగా లాభం" అని కిరాయి సైన్యాలపై ఐక్యరాజ్య సమితి వర్కింగ్‌ గ్రూప్‌లో పనిచేసిన జోస్‌ గోమెజ్‌ తన నివేదికలో వ్యాఖ్యానించారు. మరోవైపు విదేశాల్లో తమ సైన్యాలను బరిలోకి దించుతున్న అమెరికాలాంటి దేశాలకు కూడా ఈ కిరాయి సైన్యాలు కలసి వస్తున్నాయి. కారణం- అధికారికంగా తక్కువ మంది సైనికులను విదేశంలో యుద్ధానికి పంపినట్లు చూపించవచ్చు. కిరాయి సైనికుల రూపంలో ఎంతమందినైనా రంగంలో దించొచ్చు. అంతేగాకుండా విదేశాల్లో యుద్ధంలో మరణించిన/గాయపడ్డ తమ సైనికుల సంఖ్య కూడా ఈ మేరకు తగ్గిపోతుంది.

తాజా యుద్ధంలోనూ..

తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఈ కిరాయి సైన్యాల పాత్ర తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే ఇరు పక్షాలూ ఒకరినొకరు నిందించుకోవటం! రష్యా తమ దేశంపై యుద్ధం ప్రకటించగానే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశ రక్షణ కోసం అంటూ ఓ అంతర్జాతీయ 'వాలంటీర్ల సైన్యాన్ని' సృష్టించారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి.. తమ దేశ రక్షణకు సాయపడేందుకు స్వచ్ఛందంగా రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 20వేల మంది 'వాలంటీర్లు' ఉక్రెయిన్‌ సైన్యానికి తోడైనట్లు సమాచారం.

మరోవైపు యుద్ధంలో పాల్గొనటానికి పశ్చిమాసియా నుంచి 16వేల మంది 'వాలంటీర్లు' సిద్ధంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించటం విశేషం. గతంలో చెచెన్యా తదితర ప్రాంతాల్లో యుద్ధం చేసిన ప్రైవేటు సైన్యాలు రష్యా తరఫున రంగంలోకి దిగాయంటున్నారు. వీటిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు వాగ్నర్‌ గ్రూపు! ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా పేరొందిన కిరాయి సైన్యం. సిరియా, లిబియా, పశ్చిమాసియా యుద్ధాల్లో ఈ వాగ్నర్‌ సైన్యం కీలకపాత్ర పోషిస్తోంది. వాగ్నర్‌ కిరాయి సైన్యాన్ని దించటం ద్వారా రష్యా బలహీనపడినట్లయిందని అమెరికా, ఉక్రెయిన్‌ తదితర దేశాలన్నీ నిందిస్తున్నాయి.

ఇవీ చదవండి:బాలికకు బైడెన్​ 'స్పెషల్​ డేటింగ్‌' సలహా.. వీడియో వైరల్​!

ఉరుముతున్న అణు యుద్ధం!.. అదే జరిగితే 300 కోట్ల మంది మృత్యువాత!!

ABOUT THE AUTHOR

...view details