Imran Khan: తనకు వచ్చిన కానుకల విషయంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. తనకు వచ్చిన కానుకలు తనకే సొంతమని.. వాటిని ఏమైనా చేసుకునే వెసులుబాటు తనకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానిగా మూడున్నరేళ్ల పదవీ కాలంలో పలువురు నేతల నుంచి అందుకొన్న కానుకలను నిబంధనలకు విరుద్ధంగా ఇమ్రాన్ తన దగ్గరే ఉంచుకున్నారని, వాటిలో కొన్నింటిని అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విధంగా స్పందించారు.
నిబంధనల ప్రకారం బహుమానంగా వచ్చిన కానుకలు సర్కారు ఖజానాకు (Toshakhana) జమ చేయాల్సి ఉన్నప్పటికీ రూ.కోట్ల విలువ చేసే కానుకలను ఇమ్రాన్ ఖాన్ తీసుకున్నారని అధికార పక్ష పీఎంఎల్‌ఎన్ చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. 'అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. నిబంధనల ప్రకారం 50 శాతం చెల్లించి ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కానుకలు తీసుకున్నా. ఒకవేళ తాను అవినీతికి పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే తాను కూడా ముందుకు వస్తా. మూడేళ్ల కాలంలో తనపై ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందుకు సంతోషం..' అంటూ స్థానిక మీడియాతో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.