Medicine in China for Indian students : చైనాలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. వైద్య విద్య కోసం ఆ దేశానికి వెళ్లే విద్యార్థులు ఎదుర్కొనే కఠిన నిబంధనలు.. తగ్గుతోన్న ఉత్తీర్ణత శాతం.. భాష వంటి సమస్యల గురించి హెచ్చరించింది. ఈ మేరకు బీజింగ్‌లోని భారత దౌత్య కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.
ఆ కాలేజీల్లో మెడిసిన్ చదువుతారా? అయితే జాగ్రత్త.. విద్యార్థులకు కేంద్రం వార్నింగ్! - చైనాలో ఎంబీబీఎస్ భారత్ హెచ్చరిక
భారత్, విదేశాల నుంచి కొత్త విద్యార్థుల కోసం చైనా మెడికల్ కాలేజీలు ప్రవేశాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బీజింగ్‌లో భారత ఎంబసీ.. విద్యార్థులకు పలు సూచనలు జారీ చేసింది. చైనాలో చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించింది.
MBBS in China for Indian students 2022 : కరోనా సమయంలో చైనా నుంచి తిరిగొచ్చిన వేలాది మంది భారత విద్యార్థులు.. డ్రాగన్ కఠిన ఆంక్షల కారణంగా రెండేళ్లుగా స్వదేశంలోనే చిక్కుకుపోయారు. వీరి సంఖ్య 23వేలకు పైగానే ఉంటోందని అంచనా. ఇందులో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. వీరిలో కొంతమందికి వీసాలు పునరుద్ధరించే ప్రక్రియను ఇటీవల చైనా మొదలుపెట్టింది. కానీ, ప్రస్తుతానికి చైనాకు నేరుగా విమానాలు లేకపోవడంతో విద్యార్థులకు సమస్యలు తప్పట్లేదు. మరోవైపు భారత్, విదేశాల నుంచి కొత్త విద్యార్థుల కోసం చైనా మెడికల్ కాలేజీలు ప్రవేశాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బీజింగ్‌లో భారత ఎంబసీ.. విద్యార్థులకు పలు సూచనలు జారీ చేసింది. చైనాలో చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించింది.
అడ్వైజరీలోని ముఖ్యాంశాలు ఇవే..
- చైనాలో మెడిసిన్ చేసిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్‌ఎంజీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 2015 నుంచి 2021 మధ్య చైనాలో క్లినికల్ మెడిసిన్ ప్రోగ్రామ్ అభ్యసించిన 40,417 మంది విద్యార్థులు ఎఫ్‌ఎంజీ పరీక్షకు హాజరవ్వగా.. కేవలం 6,387 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే కేవలం 16 శాతం మంది మాత్రమే భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అర్హత సాధించారు. చైనా యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి.
- చైనాలో కేవలం 45 మెడికల్ కాలేజీలను మాత్రమే అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇవి ఐదేళ్ల విద్యాభ్యాసం, ఏడాది ఇంటర్న్‌షిప్‌తో మెడికల్ డిగ్రీని అందజేస్తాయి. ఆంగ్లభాషలో మెడిసిన్ చదవాలనుకునే విదేశీ విద్యార్థులు కేవలం ఈ 45 యూనివర్శిటీల్లోనే చేరాలని చైనా ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. ఇవి కాకుండా వేరే యూనివర్సిటీలో భారత విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవద్దు.
- చైనా భాషలో బోధించే యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు చేరేందుకు అనుమతి లేదు. ఇక ఆంగ్లం, చైనీస్ రెండు భాషల్లో వైద్య విద్యను బోధించే యూనివర్సిటీల్లో అస్సలు చేరకూడదు.
- క్లినికల్ సెషన్స్‌కు విదేశీ విద్యార్థులు చైనా భాష నేర్చుకోవడం తప్పనిసరి. అందువల్ల ప్రతి విద్యార్థి కనీసం హెచ్‌ఎస్‌ఎకే-4 స్థాయి వరకు చైనా భాష నేర్చుకోవాల్సి ఉంటుంది. భాషా పరీక్షలో పాస్ అవ్వని విద్యార్థులకు మెడికల్ డిగ్రీ ఇవ్వరు.
- చైనాలో మెడిసిన్ చేసే భారత విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అక్కడే ప్రాక్టీస్‌కు లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత చైనా మెడికల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి చైనాలో ప్రాక్టీస్‌కు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఉంటేనే, భారత్‌లో అర్హత పరీక్షకు హాజరయ్యే అవకాశముంటుంది.
- 2021 నవంబరు 18 నాటి నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేషన్స్ ప్రకారం.. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థి భారత్‌లో ఎఫ్‌ఎంజీ పరీక్షకు హాజరయ్యే ముందు.. తప్పనిసరిగా వారు చదువు పూర్తిచేసిన దేశంలో ప్రాక్టీస్‌కు లైసెన్స్ తీసుకోవాలి.
- చైనాలో మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులు కూడా భారత్‌లో నీట్-యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాసైన విద్యార్థులు మాత్రమే చదువు పూర్తయిన తర్వాత ఎఫ్‌ఎంజీ పరీక్ష రాసేందుకు అర్హులు.
- కొవిడ్ కారణంగా చైనా ప్రస్తుతం జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. ఇందువల్ల క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉన్నాయి. అక్కడకు వెళ్లాలనుకునే విద్యార్థులు వాటన్నింటినీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. యూనివర్సిటీల్లో ఫీజులు, వీసా నిబంధనలు కూడా ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.