McDonalds to sell its Russian business: రష్యాలోని తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు దిగ్గజ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ సోమవారం వెల్లడించింది. విక్రయ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఆ దేశంలో మెక్‌డొనాల్డ్స్‌కు 850 రెస్టారెంట్లలో 62వేల మంది ఉగ్యోగులున్నారు. దీంతో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి రష్యాను విడిచి వెళ్తున్న అతి పెద్ద పాశ్చాత్య సంస్థల జాబితాలో మెక్‌డొనాల్డ్స్ చేరినట్లు అయ్యింది.
యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని ఎత్తిచూపుతూ.. "రష్యాలో ఇకపై వ్యాపారం చేయడం సమంజసం కాదు. అది సంస్థ విలువలకు విరుద్ధం కూడా" అని మెక్‌డొనాల్డ్స్ పేర్కొంది. చికాగో కేంద్రంగా ఉన్న ఈ సంస్థ.. రష్యాలోని స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించింది. అయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ వచ్చింది.
ఈ విక్రయం ముగిసే వరకు ఉద్యోగులను నియమించుకుని, వారికి జీతాలిచ్చేందుకు ఓ కొనుగోలుదారుడి కోసం ప్రయత్నిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ సోమవారం తెలిపింది. "సంస్థ పట్ల ఉద్యోగులు, రష్యా సరఫరాదారుల అంకితభావం, విధేయత వల్ల ఇలాంటి (మూసివేత) నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. అయితే విలువలకు కట్టుబడి ఉండటం మూలంగా ఇవి తప్పదు" అని మెక్‌డొనాల్డ్స్ సీఈఓ క్రిస్ చెప్పారు.
బలమైన ప్రస్థానం: మాస్కో నడిబొడ్డున మూడు దశాబ్దాల కింద.. బెర్లిన్ గోడ పతనమైన కొన్నాళ్లకే రష్యాలో తొలి మెక్‌డొనాల్డ్స్ ప్రారంభమైంది. అమెరికా, సోవియెట్ యూనియన్ మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితులు సడలుతున్నాయనేదానికి ఇది బలమైన సంకేతంగా నిలిచింది. 1991లో పతనమైన సోవియన్ యూనియన్‌లో ఏర్పడిన తొలి అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ కూడా ఇదే.