పాకిస్థాన్‌లో బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకోవడం వల్ల బస్సులో ఉన్న దాదాపు 18 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులంతా ఇటీవల పాక్‌ను ముంచెత్తిన వరద బాధితులు కావడం గమనార్హం.
"ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే. విపత్తు సమయంలో వారికి మోటార్ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. తిరిగి వారంతా తమ సొంత జిల్లా దాదుకు వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వెనక భాగంలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించడంతో.. అనేక మంది సజీవదహనమయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు" అని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.