Shinzo Abe Shot: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. శుక్రవారం నరా నగరంలోని ఓ వీధిలో ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. నరా నగరానికి చెందిన 41 ఏళ్ల యమగామి ఎట్సుయా.. మాజీ ప్రధానిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని ఘటనాస్థలం వద్దే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు గుర్తించారు. ఆ ఆయుధంతోనే దుండగుడు కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
కేవలం 10 అడుగుల దూరంలోనే.. షింజో అబేను అత్యంత సమీపం నుంచే కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అబేకు వెనుకవైపు 10 అడుగుల దూరంలోకి వచ్చి నిందితుడు యమగామి షార్ట్ గన్‌తో రెండుసార్లు కాల్పులు జరిపినట్లు జపాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాల్పుల అనంతరం అతడు పారిపోతున్న దృశ్యాలు.. పోలీసులు పట్టుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.