దక్షిణ అమెరికాలో ఉండే ఈ అడవులు ప్రపంచంలోనే అత్యంత దట్టమైనవి. దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. తొమ్మిది దేశాలలో సువిశాలంగా విస్తరించి.. భూగోళానికి ఆత్యధిక స్థాయిలో ఆక్సిజన్ అందించే ఈ సతతహరిత అరణ్యాలను ప్రపంచానికి 'ఊపిరితిత్తులు' అని కూడా అంటుంటారు. ఆమెజాన్ పరిధిలో మూడు కోట్ల మంది జనాభా జీవిస్తుండగా.. అందులో 350 రకాల జాతుల వాళ్లు ఉన్నారు. వారిలో 60 రకాలు ప్రపంచంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ భూమండలం మీద ఇప్పటికీ తమ మూలాలను మరచిపోని మూలవాసులన్న మాట.
ఈ వస్తువినిమయ ప్రపంచంతో.. ఆధునిక పోకడలతో సంబంధం లేని అడవిబిడ్డలు వారంతా. బాహ్యప్రపంచంతో.. నాగరికులమని చెప్పుకొనే జనంతో కలవడానికి ఇష్టంలేక ఆటవికులుగానే మిగిలిపోయిన ఆదిమ జాతులవి. ఆమెజాన్ అడవుల్లో కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అపారమైన ఖనిజ సంపద కోసం.. అటవీ వనరుల కోసం.. క్రూర మృగాలను వేటాడటం కోసం కాచుకు కూర్చున్న కబంధులైన గనుల మాఫియా నుంచి తమను, తమ అడవులను కాపాడుకుంటూ వస్తున్న ఆదిమ జాతులు అవి.
ఆధునిక ఆయుధాలతో.. సాంకేతిక వనరుల సాయంతో వారి మీద దాడులకు పాల్పడి వారి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న కబంధ హస్తాల నుంచి ఎన్నాళ్లుగానో తమను తాము కాపాడుకుంటూ తమ ఉనికి బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న ఆ అడవి బిడ్డలను ఒక్కొక్కరిగా మట్టు పెట్టేస్తున్న క్రూరుడు నేటి నాగరికత నేర్చిన మనిషి. అలాంటి ఆదిమవాసులకు చెందిన ఓ జాతిలోని చిట్టచివరి మనిషి ఇటీవలే తన పోరాటంలో అలసిపోయి కన్ను మూశాడని బాహ్య ప్రపంచం గుర్తించింది. ఇప్పటికే ఎంతో క్రూరమైన గనుల మాఫియా వారి అంతం కోసం కత్తులు నూరుతున్నా.. ఆధునిక మానవుల్లో కాస్తంత మానవత్వం ఉన్నవారు కొందరు ఆ మట్టి మనుషుల బాగు కోసం పాటుపడుతున్నారు. అలాంటి సంరక్షకులు పెట్టిన కెమెరాలో ఆ చివరి మానవుడి అంతిమ దృశ్యాలు నిక్షిప్తమై బయటకు వచ్చాయి.
బొలీవియా సరిహద్దులో ఉండే రోండోనియా రాష్ట్రంలోని టనారు అనే ప్రాంతంలో బాహ్యప్రపంచానికి తెలియని ఆదిమవాసులు జీవించేవారు. 1970 దశకంలో ఈ అటవీ ప్రాంత ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్న భూస్వాముల చేతిలో ఈ జాతికి చెందినవారు చాలామంది హతమైపోయారు. ఏడుగురు మాత్రం మిగలగా.. 1995లో గనుల మాఫియా దాడి చేసి ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. పచ్చటి అడవుల్లో ఆకులో ఆకులై.. ప్రకృతితో మమేకమై బతుకుతున్న ఆ గుంపు మొత్తం అంతరించిపోగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం మిగిలాడు. 26 ఏళ్లుగా అంతపెద్ద అడవిలో ఒక్కడంటే ఒక్కడే బతుకుతున్నాడు.
బ్రెజిల్‌కు చెందిన 'ఫ్యునాయ్' అనే ఆదిమవాసుల పరిరక్షణ విభాగం అక్కడ నిఘా కెమెరాలు పెట్టి అతడి సంరక్షణపై దృష్టి పెట్టింది. 2018లో ఒకసారి ఒక కెమెరా కంటికి అతడు చిక్కాడు. మళ్లీ అతడి ఆనవాళ్లు కనిపించలేదు. వారం క్రితం ఆగస్టు 23న అతడి మృతదేహం కెమెరాలో రికార్డు కావడం విషాదకరం. ఆ సువిశాలమైన అడవుల్లో ఒంటరిగా నిర్మించుకున్న చిన్న పూరి గుడిసెకు దగ్గరలో అడవిలో దొరికే అందమైన పక్షి ఈకల మధ్య సేదతీరుతున్నట్లుగా ప్రాణంలేని అతడి దేహం కనిపించింది.
సుమారుగా అరవయ్యేళ్ల వయసు ఉండవచ్చని భావిస్తున్న ఆ అడవిబిడ్డడు తన చావును ముందుగానే ఊహించి.. అందమైన పక్షి ఈకలతో 'అంపశయ్యను' ఏర్పరచుకుని తన అంతిమ ఘడియల కోసం ఎదురుచూస్తూ తనువు చాలించి ఉంటాడని భావిస్తున్నారు. అప్పటికే అతడు చనిపోయి 40-50 రోజులై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ ఎలాంటి ప్రతిఘటన ఆనవాళ్లూ లేవు కనుక అది సహజమరణమే అని భావిస్తున్నారు.