Male Maldives Polls Today : భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కారణంగా స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో మయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధించింది. మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే జరిగిన మేయర్ ఎన్నికల్లో మయిజ్జుకు షాక్ తగిలింది. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా అఖండ విజయంగా అభివర్ణించింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం జరిగింది.
ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు.
'మాది చిన్న దేశమే, బెదిరించడం తగదు'
మరోవైపు భారత్‌తో దౌత్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్పందించారు. చైనా పర్యటనను ముగించుకుని శనివారం స్వదేశానికి చేరుకున్న ఆయన, విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. "భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం మాత్రం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు. ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే. కానీ మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) ఉంది. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందినది కాదు. ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిది. మేం ఎవరి పెరడులోనో లేము. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది"’ అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.