Maldives President China Visit : మాల్దీవులకు మరింత ఎక్కువగా పర్యటకులను పంపే ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో భారత్‌కు చెందిన పర్యటకులు ఆ దేశానికి వెళ్లకుండా తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పర్యటకులను పంపాలని చైనాకు మాల్దీవులు విజ్ఞప్తి- భారత్‌పై మరోసారి బయటపడిన డ్రాగన్ వక్రబుద్ధి - మాల్దీవుల అధ్యక్షుడు చైనా
Maldives President China Visit : భారత్‌లో మాల్దీవులపై నెగిటివ్ ట్రెండ్ నడుస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు చైనాకు విజ్ఞాపన చేశారు. తమ దేశానికి మరింత మంది పర్యటకులను పంపే ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, భారత్‌పై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. మాల్దీవులు పట్ల భారత్ విశాల దృక్పథంతో ఆలోచించాలని కోరింది.
Published : Jan 9, 2024, 9:13 PM IST
ఐదు రోజుల చైనా పర్యటనలో భాగంగా ముయిజ్జు రెండో రోజు మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. చైనా తమకు అత్యంత సన్నిహిత దేశమని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు 50 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయని మాల్దీవుల మీడియా పేర్కొంది. 2022, 2023లో మాల్దీవులను సందర్శించిన విదేశీయుల జాబితాలో భారతీయులే అత్యధికులని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ తెలిపింది. రెండో స్థానంలో రష్యా ఉండగా, చైనా మూడో స్థానంలో ఉందని పేర్కొంది. కొవిడ్‌కు ముందు మాల్దీవుల సందర్శనలో చైనీయులే మొదటి స్థానంలో ఉండేవారు.
భారత్‌పై చైనా అక్కసు
China On India Maldives Row :భారత్, మాల్దీవుల మధ్య వివాదాన్ని ఆసరాగా చేసుకొని చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ నోరు పారేసుకుంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తామని, దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని పేర్కొంది. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదని రాసుకొచ్చింది. మాల్దీవులకు భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదని పేర్కొంది. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో దిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయని దానికి చైనాను నిందించడం మాని మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది.