Maldives Ministers Suspended :భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసినట్లు వార్తలను ఆ దేశ మంత్రి హసన్ జిహాన్ ఖండించారు. అది 'ఫేక్ న్యూస్' అని ట్వీట్ చేశారు. మరియం షియునా, మాల్షా షరీఫ్, హసన్ జిహాన్‌ను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు వార్తలు రావడం వల్ల స్పందించారు.
అంతకుముందు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని అది ద్వేషాన్ని పెంపొందించేదిగా ఉండకూడదని హితవు పలికింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించినా మరో మంత్రి హసన్ జిహాన్ క్లారిటీ ఇచ్చారు.
భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత
మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖలపై భారత సెలబ్రిటీలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. అక్కడి అందాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా మాల్దీవుల మంత్రికి బదులిస్తున్నారు.
"మాల్దీవుల మంత్రి చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు చూశాను. భారీ స్థాయిలో పర్యటకులను పంపించే దేశం (భారత్)పై అలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం. కానీ, ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ప్రశంసించా. ఆత్మగౌరవమే ఫస్ట్. భారత దీవుల్లో ప్రయాణిస్తూ (#ExploreIndianIslands).. మన పర్యాటకానికి మద్దతు తెలుపుదాం" అని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.
"లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచ్‌లలో ప్రధానమంత్రి మోదీని చూడటం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలోనే ఉండటం" అని నటుడు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. లక్షద్వీప్ బీచ్‌ల అందాలపై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా గళాన్ని విప్పారు. సుందరమైన బీచ్‌లకు నెలవైన అందాలను చూసేందుకు ఈ ఏడాది ప్లాన్ చేసుకుంటున్నానని అన్నారు.
అదే బాటలో తెందూల్కర్
లక్షద్వీప్ అందాలపై దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా స్పందించారు. 'సింధూదుర్గ్‌లో ఇటీవల పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నా. మాకు కావాల్సినవన్నీ లభించాయి. అందమైన ప్రదేశాలు, అద్భుతమైన ఆతిథ్యం ఎన్నో జ్ఞాపకాలను అందించాయి. ఎన్నో అందమైన, సహజ దీవులకు భారత్ నెలవు. చూడాల్సిన ప్రదేశాలు, ఎన్నో జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి వేచి చూస్తోంది' అంటూ తెందూల్కర్ ట్వీట్ చేశారు. అక్కడ క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటో షేర్ చేశారు.
మాల్దీవుల పర్యటనలు రద్దు
వీరితోపాటు మరికొంత మంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ త్వరలో పర్యటించాలనుకుంటున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలను విరమించుకుంటామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమ ట్రిప్‌ను రద్దు చేసుకుంటున్నామని పేర్కొంటూ ట్వీట్ చేస్తున్నారు.