తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యటకులపై విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి..

Malaysia Landslide 2022 : మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక కేంద్రంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారు.

Malaysia landslide 2022
మలేసియాలో విరిగిపడ్డ కొండచరియలు

By

Published : Dec 16, 2022, 12:31 PM IST

Updated : Dec 16, 2022, 12:48 PM IST

Malaysia Landslide 2022 : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బటాంగ్ కలి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 17 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 94 మంది మలేసియన్లు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిలో 59 మందిని సహాయక బృందాలు కాపాడాయి.

సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్

ఘటనా స్థలి వద్ద 400 మంది సిబ్బంది, జాగిలాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటలలోపు ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఉన్న భాగం నుంచి కొండచరియలు వ్యవసాయ క్షేత్రంలోకి కూలినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడినప్పుడు పెద్ద శబ్ధం వచ్చిందని ప్రమాదం నుంచి బయటపడినవారు తెలిపారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కూడా పడలేదు. ఓ మోస్తరు వర్షమే కురిసింది.

సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్

గెంటింగ్ హైలాండ్స్ హిల్ రిసార్ట్‌కు సమీపంలో ఈ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడే టెంటులు వేసుకుని పర్యటకులు బస చేశారు. ఇది మలేసియాలో ప్రముఖ పర్యటక ప్రాంతంగా పేరుగాంచింది. మృతులంతా మలేసియా వాసులేనని అధికారులు ప్రకటించారు.

Last Updated : Dec 16, 2022, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details