లాటరీ తగలడమే పెద్ద అదృష్టంగా భావిస్తారు అందరూ.. అదే లాటరీ భారీ స్థాయిలో కోట్ల రూపాయలు కుమ్మరిస్తే.. కనీవినీ ఎరుగని రీతిలో కాసుల వర్షం కురిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అప్పటి వరకూ గడిపే సాదాసీదా జీవితం ఒక్కసారిగా మారిపోతుంది! కన్న కలలన్నీ నిజం చేసుకునే పరిస్థితులు మన చేతుల్లోనే ఉంటాయి! ఓ అమెరికన్‌కు అచ్చం ఇలాంటి అదృష్టమే వరించింది.
మెగా మిలియన్ డ్రాలో జాక్‌పాట్.. రూ.10వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తి
ఓ వ్యక్తి భారీ జాక్‌పాట్ కొట్టేశాడు. మెగా మిలియన్స్ జాక్పాట్లో రూ.10,973 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. జనవరి 13న తీసిన డ్రాలో అతడు కొనుగోలు చేసిన టికెట్లలోని అన్ని నంబర్లు సరిపోలాయి.
వివరాల్లోకి వెళ్తే..మైనే స్టేట్‌లోని లెబనాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్ జాక్పాట్లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజు.. అతడికి భారీ జాక్‌పాట్ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్ జాక్‌పాట్ తీసిన డ్రాలో విన్నింగ్ టికెట్ సంఖ్యతో అతడి టిక్కెట్లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగామిలియన్స్ జాక్‌పాట్.
అయితే అతడు గెలుచుకున్న మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 ఏళ్లపాటు వాయిదాల పద్దతిలో చెల్లిస్తారు. మొత్తం ఒకేసారి కావాలంటే రూ.7వేల కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ చాలా మంది వాయిదాల పద్దతిలో కాకుండా ఒకేసారి తీసుకుంటారు.
మెగా మిలియన్స్ జాక్‌పాట్‌ను గెలుచుకున్న వ్యక్తికి ఆ లాటరీ సంస్థ ప్రధాన డెరెక్టర్ పాట్ మెక్డొనాల్ట్ అభినందనలు తెలిపారు. మెగా మిలియన్స్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద జాక్‌పాట్ అని ఆయన తెలిపారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి రూ.12,436 కోట్లు గెలుచుకున్నాడు. కాగా, మెగా మిలియన్స్ జాక్‌పాట్ సుమారు 40 ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతోంది.