సాధారణంగానే లాటరీలు అంటే ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిది లాటరీ విలువ రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటే ప్రజల్లో పోటీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో గత నలభై ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతున్న మెగా మిలియన్స్ జాక్‌పాట్ 2023లో తొలి లాటరీని నిర్వహించింది. ఈ పోటీల్లో ఓ వ్యక్తి రూ. 10,973 కోట్లను గెలుచుకున్నాడు. మరీ ఈ లాటరీ ఎలా ఉంటుంది? విజేతను ఎలా ఎంపిక చేస్తారు? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
మెగా మిలియన్స్ జాక్‌పాట్ రూల్స్
- మెగా మిలియన్స్ జాక్పాట్లో పాల్గొనాలంటే మొదటగా వెబ్సైట్ నుంచి టికెట్ కొనుక్కోవాలి. దీని ధరను రూ.162గా నిర్ణయించారు.
- ఆ తర్వాత రెండు వేర్వేరు విభాగాల నుంచి ఆరు అంకెలను ఎంపిక చేసుకోవాలి
- మొదటి విభాగంలో ఐదు వేర్వేరు అంకెలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 70 వరకు అంకెలు ఉంటాయి.
- రెండో విభాగంలో ఒక అంకెను ఎంపిక చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 25 అంకెలు ఉంటాయి. దీనినే మెగాబాల్ అంటారు.
- ఈ ఆరు అంకెలు ఒకేసారి కలిసిన వారిని ఈ మెగా మిలియన్స్ జాక్‌పాట్ వరిస్తుంది.
- 30,25,75,350 మంది పోటీదారుల్లో పాల్గొంటే ఒకే వ్యక్తిని ఈ జాక్‌పాట్ వరిస్తుంది.
- మెగా మిలియన్స్ జాక్పాట్తో పాటు ప్రతి 1,26,07,306 మందిలో ఒకరికి రూ. 8.12 కోట్లు బహుమతిగా అందిస్తారు.
- వీరితో పాటు ప్రతి 9,31,001 మందిలో ఒకరికి రూ. 8.12 లక్షలు ఇస్తారు.
రూ. 10 వేల కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి
శుక్రవారం జరిగిన మెగా మిలియన్స్ జాక్పాట్లో మైనే స్టేట్‌లోని లెబనాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్స్ జాక్పాట్లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజు.. అతడికి భారీ జాక్‌పాట్ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్స్ జాక్‌పాట్ తీసిన డ్రాలో విన్నింగ్ టికెట్ సంఖ్యతో అతడి టిక్కెట్లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగామిలియన్స్ జాక్‌పాట్.
ఎలా చెలిస్తారు? పన్నులు ఎంత?
విజేతకు మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.7వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత అతడికి వచ్చిన సొమ్ము సుమారు రూ.5వేల కోట్లుగా మారనుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్ కట్టాలి. రాష్ట్రాన్ని బట్టి అది 0-10 శాతం ఉండొచ్చు. ఈ లెక్కన అతడికి సుమారు రూ. 3వేల కోట్లు అందుతాయి.