Britain New Prime Minister : బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించిన లిజ్ ట్రస్ ఆ దేశ ప్రధానిగా అధికారికంగా నియమితులయ్యారు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2, నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్‌ను నియమించారు. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో ఉన్న రాణి ఎలిజబెత్‌తో లిజ్ ట్రస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాణి ఎలిజబెత్ సూచించడంతో అందుకు ట్రస్ అంగీకరించారు. అంతకుముందు క్వీన్‌ను కలిసిన బోరిస్ జాన్సన్.. తన రాజీనామాను అందజేశారు.
ఇదిలాఉంటే, అధికార కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగమంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ విజయం సాధించింది. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై ఆమె గెలుపొందారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చాయి. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా 47 ఏళ్ల లిజ్ రికార్డు సృష్టించారు.