UK PM race: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునాక్, సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పోటీలో లిజ్ ట్రస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ది అబ్జర్వర్ వార్తాపత్రికలో వచ్చిన ఒపీనియమ్ సంస్థ చేపట్టిన సర్వేలో 570 మంది కన్జర్వేటివ్ సభ్యులు పాల్గొనగా.. లిజ్ ట్రస్‌కు 61శాతం, రిషి సునాక్‌కు 39శాతం మద్దతు లభించింది. దాదాపు 22 అంశాలపై టోరి మెంబర్లను ప్రశ్నించగా.. దాదాపు సగానికిపైగా ట్రస్‌కే తమ ఓటు వేశారు.
ఇప్పటివరకు లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నప్పటికీ పార్టీ నేతగా గెలిచేందుకు రిషీకి ఇంకా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రస్‌కు సీనియర్ కన్జర్వేటివ్ సభ్యులు మద్దతు పలుకుతుండగా, సునాక్‌కు మాత్రం యువనేతలు అండగా ఉన్నట్లు తాజా సర్వేలను బట్టి తెలుస్తోంది. అయితే, బోరిస్ జాన్సన్‌ను రాజీనామా చేయాలని రిషి సునాక్ కోరడం ఆయనకు ప్రతికూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జాన్సన్‌కి సన్నిహితురాలుగా పేరొందిన ట్రస్ మాత్రం బోరిస్ జాన్సన్‌ను రాజీనామా చేయాలని కోరకపోవడం ఆమెకు కలసివస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.