Libya Floods 2023 Death Toll :ఆఫ్రికా దేశం లిబియాలోని డెర్నా నగరంలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంలో 11,300 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశరెడ్ క్రెసెంట్ గురువారం వెల్లడించింది. మరో 10,100 మంది ఆచూకీ దొరకడంలేదని తెలిపింది. వరదనీటి ఉద్ధృతికి రెండు డ్యామ్‌లు బద్దలవడమే ఈ భారీస్థాయి ప్రాణనష్టానికి కారణమైంది. ఈ వరద వేలాది మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. ఇప్పుడా మృతదేహాలు తిరిగి తీరానికి కొట్టుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో సముద్ర తీరం శవాల కుప్పగా మారిందని వెల్లడించారు. ఈ విపత్తులో చాలా వరకు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడం వల్ల ఇతర నగరాల్లోని మార్చురీలకు తరలిస్తున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలను సామూహిక ఖననం చేస్తున్నారు.
విదేశాల నుంచి సహాయక బృందాలు..
వరద ప్రభావం ఎక్కువగా ఉన్న డెర్నా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తుర్కియే, యూఏఈ, ఈజిప్టు, ట్యునీషియా, ఖతార్ నుంచి సహాయక బృందాలు వెళ్లాయి. వరద కారణంగా రహదారులు కొట్టుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రోజుల తరబడి మృతదేహాలు నీటిలోనే ఉండటం వల్ల అంటు వ్యాధుల ప్రబలే ముప్పు పొంచి ఉందని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.