తెలంగాణ

telangana

ETV Bharat / international

Libya Flood Death Toll : కోలుకోని లిబియా.. బీచ్​లో గుట్టలుగా మృతదేహాలు.. తిండి, నీరు లేక ప్రజల అవస్థలు!

Libya Flood Death Toll : ఇళ్లు, వీధులు, సముద్ర తీరం.. ఇలా ఎక్కడ చూసినా మృతదేహాలే.. ఏ ప్రాంతంలో చూసినా కొట్టుకొచ్చిన వందలాది వాహనాలే. ఏ ఆస్పత్రిలో చూసినా వేలాదిమంది క్షతగాత్రులే. ఇది ప్రకృత్తి కత్తిగట్టిన లిబియాలోని డెర్నా నగర దుస్థితి. ఆరంతస్తుల అంత ఎత్తున్న రాకాసి అల.. డెర్నాపై విరుచుకుపడడం వల్ల ఇంత విధ్వంసం జరిగిందని నిపుణులు అంచనా వేశారు. పెద్దపెద్ద భవనాలను కూల్చేసిన ఆ రాకాసి అల.. ప్రజలను సముద్రంలోకి లాక్కుని వెళ్లిపోయింది. ఈ మహా విలయంలో డెర్నాలోనే 20 వేలమందికి పైగా కన్నుమూశారు.

Libya Flood Death Toll
Libya Flood Death Toll

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 4:03 PM IST

Libya Flood Death Toll :డేనియల్‌ తుపాను మిగిల్చిన విషాదం నుంచి లిబియా ఇంకా తేరుకోలేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన డెర్నా నగరంలో పరిస్థితి కుదుటపడలేదు. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెర్నాలో కేవలం ఒక్కే ఒక్క రాకాసి అల.. 20 వేల మంది ప్రాణాలను బలిగొందని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ నిపుణులు వెల్లడించారు. ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని తెలిపారు. పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొందని.. అందువల్లే మరణాల సంఖ్య భారీగా ఉందని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ నిపుణులు వివరించారు. అత్యంత వేగంతో దూసుకొచ్చిన బురద నీరు.. భారీ భవనాలను కుప్పకూల్చి.. ప్రజలను ఈడ్చుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడి సముద్ర తీరంలో తేలియాడుతున్న మృతదేహాలు స్థానికులకు కనిపిస్తూనే ఉండడం డెర్నాలో దుస్థితికి అద్దం పడుతోంది.

అస్తవ్యస్థమైన డెర్నా నగరం

డెర్నాలో వేలాది మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతికి ఇళ్లు సహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేల సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. సహాయక చర్యలు ప్రారంభించిన బృందాలకు ఎక్కడ చూసినా కుళ్లిన స్థితిలో మానవ మృతదేహాలు కనిపిస్తున్నాయి. కనీస వసతులు కూడా లేని డెర్నాలోని ఆస్పత్రులు మృతదేహాలకు నిలయాలుగా మారాయి. మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉంటుందని డెర్నా మేయర్‌ అబ్దుల్‌ మునీమ్‌-అల్‌-ఘైతీ చెప్పారు. ఇప్పటికే వేల సంఖ్యలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

అస్తవ్యస్థమైన డెర్నా నగరం

డెర్నా నగరంలో తుపాను తర్వాత పరిస్థితులు.. నాటి విధ్వంసానికి గుర్తులుగా మారాయి. పదుల సంఖ్యలో కార్లు, వాహనాలు కొట్టుకువచ్చి ఒక దగ్గర చెల్లాచెదురుగా పడిపోయాయి. కూలిపోయిన భవనాలు.. నేలకూలిన భారీ వృక్షాలు.. వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల రోదనలో.. డెర్నా భీతావాహంగా మారింది. డెర్నాలో డేనియల్‌ తుపాను విధ్వంసంలో కుటుంబాలకు కుటుంబాలే గల్లంతయ్యాయని అధికారులు తెలిపారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలు
డెర్నా నగరంలో కుప్పకూలిన భవనాలు

Libya Floods 2023 Death Toll : ఒకే సిటీలో 11,300 మృతి.. మరో 10,100 మిస్సింగ్​.. కొట్టుకొస్తున్న మృతదేహాలు..

Libya Dam Collapse : కొట్టుకొస్తున్న వేలాది శవాలు.. లిబియా జలప్రళయానికి 20వేల మంది బలి!

ABOUT THE AUTHOR

...view details