తెలంగాణ

telangana

ETV Bharat / international

కెన్యా రైతులకు కష్టాలు.. 60లక్షల పక్షుల్ని చంపుతున్న ప్రభుత్వం.. ప్రత్యేక బడ్జెట్​ సైతం.. - పంటలను నాశనం చేస్తున్న క్యూలియా పక్షులు

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కళ్లముందే నాశనం చేస్తుంటే ఏ రైతైనా బాధపడతాడు. బ్యాంకుల్లో వడ్డీకి రుణాలు తెచ్చి మరీ ధాన్యాన్ని పండిస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో ఓ పక్షుల గుంపు వచ్చి వరికోతను పాడు చేస్తుంటే ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం కెన్యా దేశానికి చెందిన కర్షకులు. ఈ పక్షుల బెడదను తట్టుకోలేక ఏకంగా అక్కడి ప్రభుత్వమే రంగంలోకి దిగి బడ్జెట్​లో కేటాయింపులు చేయనుంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి రైతన్నను పక్షుల గుంపు అంతలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయో తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే.

Birds Damaging Crops In Kenya
కెన్యాలో పంటలపై క్యూలియా పక్షుల దాడి

By

Published : Jan 26, 2023, 8:34 PM IST

2021లో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పొలాలపై దాడి చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. అచ్చం అలానే కెన్యాలో కూడా క్యూలియా పక్షులు అక్కడి వరి పొలాలపై గుంపులుగా వాలి మూడొంతుల పంటను తినేస్తున్నాయి. అసలే కరవుతో అల్లాడుతున్న కెన్యా ఈ పి‌చ్చుకల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అక్కడి ప్రభుత్వం ఆఖరి అస్త్రంగా సుమారు 60 లక్షల క్యూలియా పక్షులను చంపుతోంది.

కెన్యాలో పంటలపై దాడి చేస్తున్న క్యూలియా పక్షి

క్యూలియా పక్షులు అచ్చం మన దగ్గర ఉండే పిచ్చుకల్లా ఉంటాయి. ఎర్రటి ముక్కుతో చూడ్డానికి అందంగా ఉంటాయి. దీనికి ఆఫ్రికన్‌ నైటింగల్ అనే పేరు కూడా ఉంది. ఈ పక్షులు పెద్ద ఎత్తున సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇవి ప్రధానంగా గడ్డి విత్తనాలు తింటాయి. కానీ గత పదేళ్లుగా తూర్పు ఆఫ్రికా దేశాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి. పచ్చిక బయళ్లన్నీ ఎండిపోవడంతో క్యూలియా పక్షులకు సహజ అహారమైన గడ్డి విత్తనాలకు కొరత ఏర్పడింది. దీంతో ఆహారం కోసం వరి, గోధుమ పంటల మీద అవి దాడి చేస్తున్నాయి.

పిచికారీ చేస్తూ పక్షుల గుంపును తరుముతున్న డ్రోన్​ పరికరం

కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లో మూడొంతుల పంటలను క్యూలియా పక్షులు తినేస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్ద ఎత్తున క్రిమిసంహాకరాలను వాడి పక్షులను మట్టుబెడుతున్నారు. కెన్యా ప్రభుత్వం కూడా స్వయంగా రంగంలోకి దిగి ఏకంగా 60 లక్షల క్యూలియా పక్షులను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని చూస్తోంది.

ఆహార ధాన్యాలపై క్యూలియా పక్షుల గుంపు దాడి
క్యూలియా పక్షులను పొలం నుంచి తరుముతున్న రైతు

'వెస్ట్‌ కానో ప్రాంతంలోనే 5 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతోంది. అందులో మూడొంతుల ధాన్యాన్ని రెడ్ బిల్ట్ క్యూలియా పక్షులే తింటున్నాయి. ఇక్కడ రైతులేమో బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకొని పంటలను పండిస్తున్నారు. పంట రుణంతో పాటు వడ్డీ కట్టలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు అప్పుల భారంతో సతమవుతున్నారు. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సొరంగం చివర్లో కాంతి ఎలా ఉంటుందో దీనికి కూడా పరిష్కారం ఉంది. పక్షుల తొలగింపును క్రమబద్ధంగా చేపట్టాలి. బడ్జెట్‌లో ప్రతి ఏటా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నాను'
- జారెడ్ ఒడోయో, కెన్యా అధికారి.

మరోవైపు ప్రభుత్వ చర్యలను పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. పక్షులను చంపడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్ర్తవేత్త పాల్ గచేరు అన్నారు. డ్రోన్ల ద్వారా రసాయనాలను పిచికారీ చేసి ప్రభుత్వం సమస్యకు పరిష్కారం కనగొనాలని చూస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పక్షులను నియంత్రించడానికి పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించాలని పాల్ గచేరు సూచించారు. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ఒక్కొక్క క్యూలియా పక్షి ఒక రోజులో 10 గ్రాముల ధాన్యాన్ని తింటుంది. వింటానికి తక్కువగానే ఉన్నా గుంపులుగా వచ్చే క్యూలియా పక్షులు ఎంత ఆహారాన్ని తింటాయో మనం ఊహింకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన కరవు కాటకాల వల్లే క్యూలియా పక్షులకు సహజ ఆహారమైన గడ్డి విత్తనాల లేక ఆహార ధాన్యాలపై దాడి చేస్తున్నాయి.

ఆహార ధాన్యాలపై క్యూలియా పక్షుల గుంపు దాడి

ABOUT THE AUTHOR

...view details