తెలంగాణ

telangana

ETV Bharat / international

'శత్రువులు చాలా క్రూరులు.. కీవ్​కు అప్పుడే రావొద్దు'

Kyiv mayor comments: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని డార్నిట్స్కీ జిల్లాలో రష్యా శనివారం ఉదయం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా.. అనేకమంది గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో తెలిపారు. రాజధాని నగరంపై ఇంకా దాడులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి బయట ఉన్న ఉక్రెయిన్ పౌరులెవరూ ఇప్పుడే కీవ్​కు రావొద్దని కోరారు.

Kyiv mayor comments
కీవ్ మేయర్

By

Published : Apr 16, 2022, 9:24 PM IST

Kyiv mayor comments: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో రష్యా మరోసారి బాంబులతో విరుచుకుపడుతోంది. శనివారం ఉదయం కీవ్‌లోని డార్నిట్స్కీ జిల్లాలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా.. అనేకమంది గాయపడినట్టు కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్స్కో వెల్లడించారు. "మనల్ని రక్షించేందుకు మన సైనిక బలగాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి.. కానీ శత్రువులు చాలా క్రూరులు, మోసగాళ్లు" అని మండిపడ్డారు. కీవ్‌లోని సాయుధ వాహన కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా సేనలు పేర్కొన్నాయని చెప్పారు. దీని వల్ల మరిన్ని దాడులు కొనసాగే అవకాశం ఉన్నందున బయట ఉన్న ఉక్రెయిన్‌ పౌరులెవరూ ఇప్పుడే కీవ్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. రాజధాని నగరంపై ఇంకా దాడులు కొనసాగే అవకాశం ఉందంటూ టెలిగ్రామ్‌ మెసెంజర్‌ యాప్‌ ద్వారా ప్రజలకు తెలియజేశారు. కీవ్‌పై మున్ముందు శత్రుదాడుల్ని కొట్టిపారేయలేమన్నారు. కీవ్‌లోకి ప్రజల రాకను నిషేధించలేమనీ.. కేవలం సిఫారసు మాత్రమే చేయగలమన్నారు. ఇప్పటికే వారు ఉన్నచోట సురక్షితంగా ఉండే అవకాశం ఉంటే మాత్రం అక్కడే ఇంకొంత కాలం ఉండాలని కోరారు.

మరోవైపు ల్వీవ్‌ నగరంలోనూ రష్యా వైమానిక దాడులకు పాల్పడినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ మాక్స్యమ్‌ కొజిత్స్కీ తెలిపారు. రష్యాకు చెందిన ఎస్‌యూ-35 విమానం బెలారస్‌లోని బరానోవిచి ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి బయల్దేరి ల్వీవ్‌లో క్షిపణి దాడులు చేసిందన్నారు. అలాగే, ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ నాలుగు క్రూయిజ్‌ క్షిపణుల్ని కూల్చి వేసిందని చెప్పారు. అయితే, ఈ దాడుల్లో జరగిన నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం గవర్నర్‌ వెల్లడించలేదు.

ఇదీ చదవండి:కీవ్​లో 900 మంది పౌరుల మృతదేహాలు.. రోజు గుట్టలుగుట్టలుగా..

ABOUT THE AUTHOR

...view details