తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్‌ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్‌ ఎ'పై విషప్రయోగం! - రష్యా ఉక్రెయిన్

Roman Abramovich: మాస్కో చరిత్రలో మరో విషప్రయోగం బయటకొచ్చింది. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలలేదు.

ukraine-peace-talks
ఉక్రెయిన్‌ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్‌ ఎ'పై విషప్రయోగం!

By

Published : Mar 30, 2022, 8:43 AM IST

Roman Abramovich Poisoned: విషం.. రష్యాతో కూడిన వ్యవహారాల్లో సైలెంట్‌ కిల్లర్‌ వలే పనిచేస్తుంది. మాస్కో చరిత్రలో మరో విషప్రయోగం బయటకొచ్చింది. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలలేదు.. కానీ, మార్చి 3వ తేదీన ఉక్రెయిన్‌-బెలారస్‌ సరిహద్దుల్లో జరిగిన చర్చల్లో రష్యా ఒలిగార్క్‌ రోమన్‌ అబ్రహమోవిచ్‌, ఉక్రెయిన్‌ ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ పార్లమెంట్‌ డిప్యూటీ రుస్తెమ్‌ ఉమెరోవ్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చర్చల సమయంలో ఉక్రెయిన్‌ బృందం సభ్యుల కళ్లు ఎర్రగా మారిపోయి, కొద్ది సేపు చూపు దెబ్బతింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. ఈ విషయాన్ని తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత అబ్రహమోవిచ్‌, ఉమెరోవ్‌లు చికిత్స కోసం టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్లారు. వీరిపై ఏ రకం విషాన్ని ప్రయోగించారో ఇంకా వెల్లడి కాలేదు. చర్చలకు ఇష్టపడని రష్యా అతివాదుల హస్తం దీని వెనుక ఉండొచ్చని ఓ నివేదికను ఉటంకిస్తూ బీబీసీ కథనంలో పేర్కొంది. రుస్తెమ్‌ ఉమెరోవ్‌ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. వాస్తవానికి ఈ ఆరోపణలు పెరిగితే శాంతిచర్చల మొత్తానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో తీవ్రత తగ్గించి చూపుతున్నట్లు భావిస్తున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత మరోసారి రష్యా-ఉక్రెయిన్‌ బృందాలు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరపనున్నాయి.

Ukrian Russial peace talks: రష్యాకు చెందిన రోమన్‌ అబ్రహమోవిచ్‌ ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్‌ కోరిక మేరకు అనధికారికంగా మధ్యవర్తి పాత్ర వహిస్తున్నారు. రష్యా ఆక్రమణ మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్యలు రోమన్‌పై ఆంక్షలు విధించాయి. రోమన్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. మరోవైపు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ ఆంక్షల నుంచి రోమన్‌ను మినహాయించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరారు. తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా రాసి ఇచ్చిన లేఖను అబ్రహమోవిచ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అందజేశారు. దీనిపై పుతిన్‌ ఆగ్రహంగా స్పందిస్తూ ‘‘నేను వాళ్లను కూలదోయగలనని అతనికి చెప్పు’’ అని హెచ్చరించినట్లు సమాచారం.

రష్యాను శాసించే స్థాయికి ఎదిగిన అనాథ:ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో రోమన్‌ అబ్రహమోవిచ్‌ ఒకరు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన ప్రఖ్యాత చెల్సియా క్లబ్‌ యజమానిగా ప్రపంచానికి సుపరిచితుడు. వ్లాదిమిర్‌ పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. మూడేళ్లకే అనాథగా మారిన రోమన్‌ కాలక్రమంలో రష్యాను ప్రభావితం చేసేంత సంపన్నుడిగా మారాడు. 1966లో రష్యాలోని సరటోవా అనే మారుమూల ప్రాంతంలో రోమన్‌ జన్మించాడు. అతడికి ఏడాది వయసున్నప్పుడు తల్లి రక్తం విషపూరితమై చనిపోయింది. మరో రెండేళ్లకు తండ్రి కూడా ఓ ప్రమాదంలో మరణించాడు. బంధువుల వద్ద పెరిగాడు.. ఎలాంటి పరిస్థితులనైనా సానుకూలంగా తీసుకోవడం అతడికి అలవాటు. 16 ఏళ్ల వయస్సుల్లో మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. సోవియట్‌ సైన్యానికి కూడా పనిచేశాడు. ఆ తర్వాత డియోడరెంట్‌లు తయారీలోకి అడుగుపెట్టాడు. 1988లో సోవియట్‌ యూనియన్‌ పెరోస్త్రాయికా సంస్కరణల సమయంలో వేగంగా ఎదిగాడు.

ఉక్రెయిన్‌ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్‌ ఎ'పై విషప్రయోగం!

Kremlin Friend Poisoned: సోవియట్‌ యూనియన్‌ ఖనిజాలపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించుకొన్న సమయంలో రోమన్‌కు అపార అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 1995లో నిర్వహించిన వేలంలో రష్యా ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీ సిబ్‌నెఫ్ట్‌ను మోసపూరితంగా 250 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకొన్నాడు. ఇదే కంపెనీని 2005లో తిరిగి రష్యా ప్రభుత్వానికి 13 బిలియన్‌ డాలర్లకు విక్రయించాడు. 2012లో యూకే కోర్టులో సిబ్‌నెఫ్ట్‌ను దక్కించుకోవడానికి అక్రమ మార్గాలను అనుసరించినట్లు పేర్కొన్నారు.

సిబ్‌నెఫ్ట్‌ను దక్కించుకొన్న తర్వాత 1990ల్లో రష్యాలోని అల్యూమినియంపై పట్టు సాధించేందుకు ఏకంగా చిన్నసైజు యుద్ధాలే జరిగాయి. వీటిని అల్యూమినియం వార్స్‌ అంటారు. ఈ క్రమంలో పలువురు అల్యూమినియం కర్మాగారాల మేనేజర్లు, లోహ వ్యాపారులు, జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. ప్రతి మూడు రోజులకో హత్య జరిగిందని రోమనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రాజకీయాల్లో కీలక పాత్ర:రోమన్‌ రష్యా తొలి అధ్యక్షుడు బోరిస్‌ ఎల్సిన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేసే సమయానికి ప్రధానిగా ఉన్న వ్లాదిమిర్‌ పుతిన్‌కు మద్దతుదారుగా మారిపోయాడు. పుతిన్‌ ప్రధాని బాధ్యతలు స్వీకరించాక.. ఆయన కేబినెట్‌ కోసం పలువురిని రోమన్‌ స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ఎల్సిన్‌ వారసుడిగా పుతిన్‌ పేరును తొలుత ప్రతిపాదించింది రోమనే. అధ్యక్షుడు అయిన తర్వాత పుతిన్‌ ఒలిగార్క్‌లను అణగదొక్కారు. కానీ, రోమన్‌ స్థాయి మాత్రం తగ్గలేదు. 2007లో పుతిన్‌ అధ్యక్ష పదవిని వదలుకోవాల్సిన సమయంలో మెద్విదేవ్‌ను వారసుడిగా సూచించిన వ్యక్తి కూడా ఆయనే. క్రెమ్లిన్‌ సర్కిల్‌లో రోమన్‌ అబ్రహమోవిచ్‌ను ‘మిస్టర్‌ ఎ’గా పిలుస్తారు. 2017లో అమెరికా విధించిన కాట్సా ఆంక్షల్లో కూడా రోమన్‌ పేరుంది. తాజాగా అమెరికా, పశ్చిమ దేశాలు ఆయనపై మరోసారి ఆంక్షలు విధించాయి.

ఛెల్సియా యజమానిగా:2003లో లండన్‌కు చెందిన ఛెల్సియా ఫుట్‌బాల్‌ జట్టును 140 మిలియన్‌ డాలర్లకు రోమన్‌ సొంతం చేసుకొన్నాడు. ఈ డీల్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత ఛెల్సియాను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా తీర్చి దిద్దారు. ఈ జట్టు ఐదు ప్రీమియర్‌ లీగ్‌లు, రెండు ఛాంపియన్స్‌ లీగ్‌లు, ఐదు ఎఫ్‌ఏ కప్‌లను గెలుచుకొంది. ఆయనకు లండన్‌లోని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌లో 15 బెడ్‌రూమ్‌ల ఇంద్రభవనం ఉంది. దీని విలువ 150 మిలియన్‌ డాలర్లు. ఇంకా అమెరికా, ఫ్రాన్స్‌ల్లోని విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

అబ్రహమోవిచ్‌ నేవీ: అబ్రహమోవిచ్‌ వద్ద భారీ ఎత్తున విలాసవంతమైన కార్లు ఉన్నాయి. దీంతోపాటు ఆయనకు గతంలో ఏరోఫ్లోట్‌లో వాటాలు కూడా ఉన్నాయి. ఇక అబ్రహమోవిచ్‌ వద్ద విలాసవంతమైన పడవలు చాలా ఉన్నాయి. దీనిని అబ్రహమోవిచ్‌ నేవీగా వ్యవహరిస్తారు. ప్రపంచలోనే అతిపెద్ద పడవల్లోని సోలారిస్‌, ఎక్లిప్స్‌ల యజమాని కూడా ఈయనే. ఎక్లిప్స్‌ విలువ 400 మిలియన్‌ డాలర్లు. ఆజమ్‌ అనే మరో పడవ కూడా ఉంది. గతంలో కూడా భారీ ఎత్తున విలాసవంతమైన పడవలను కొనుగోలు చేశాడు. ఇక బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ను 2021లో సొంతం చేసుకొన్నాడు.

ఉక్రెయిన్‌ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్‌ ఎ'పై విషప్రయోగం!

ఇదీ చదవండి:ఉక్రెయిన్‌, రష్యా చర్చల్లో కీలక ముందడుగు.. త్వరలో పుతిన్- జెలెన్​స్కీ భేటీ!

ABOUT THE AUTHOR

...view details