Korean age system: దక్షిణ కొరియా పౌరుల వయసు.. ఒకటి, రెండేళ్లు తగ్గనుందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! అవును. ఈ దేశంలో వయసు లెక్కింపును ప్రమాణీకరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడమే దీనికి కారణం. ప్రస్తుతం దక్షిణ కొరియన్లకు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వయసు లెక్కింపు విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ వయసు, కొరియన్ వయసు, క్యాలెండర్ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తికి మూడు వయసులు ఉండటం ఇక్కడ సర్వసాధారణం. ఈ గందరగోళానికి తెరదించేందుకు పార్లమెంట్ ఇటీవల ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే.. 2023 జూన్ నుంచి అంతర్జాతీయ వయసునే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది.
ఏ వయసు ఎలా లెక్కిస్తారంటే..
అంతర్జాతీయం:
దీని ప్రకారం పుట్టినప్పుడు శిశువు వయసు 'సున్నా'నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీనాటికి ఒకటి చొప్పున లెక్కిస్తారు. ప్రపంచంలోని చాలావరకు దేశాలు ఇదే వ్యవస్థను పాటిస్తాయి.
కొరియన్:
స్థానికులను వారి వయసు అడిగినప్పుడు.. చాలా మంది అంతర్జాతీయ వయసు కంటే ఒకటి, రెండు ఎక్కువగానే చెబుతారు. కారణం.. అక్కడ శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాది జోడిస్తారు.