అమెరికా, దక్షిణ కొరియాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది ఉత్తర కొరియా. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కొన్నినెలల నుంచి వరుసగా సరికొత్త ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోంది. బుధవారం ఒకేసారి 23 క్షిపణులను పరీక్షించిన కిమ్ సర్కార్ గురువారం మరో 3 మిస్సైళ్లను పరీక్షించింది. అందులో ఒకటి ఖాండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపప్రాంతం నుంచి ఉదయం 7.40 గంటలకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు.
ఓ గంట తర్వాత కాచియోన్ నగరం సమీపం నుంచి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను తూర్పు జలాల వైపు పరీక్షించినట్లు చెప్పారు. పొరుగు దేశాలకు చేరకుండా దీర్ఘశ్రేణి మిస్సైల్‌ను పరీక్షించినట్లు దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. అయితే ఉత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విఫలమైందని, అది మధ్యలోనే పేలిపోయిందన్న వార్తలపై స్పందించేందుకు దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు నిరాకరించాయి. ఈ మిస్సైల్ పరీక్షను విశ్లేషించాల్సి ఉందని పేర్కొన్నాయి.