Kim- Moon Exchanged Letters: కొరియా ఉభయ దేశాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాధినేతలు పరస్పరం లేఖలు రాసుకున్నారు. మూడేళ్లుగా అణుచర్చల్లో పురోగతి లేకపోవడం, ఆయుధాల అభివృద్ధి, క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా దూకుడు నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య ఈ పరిణామం సానుకూలాంశంగా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే- ఇన్ పదవీకాలం అతిత్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం మూన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు లేఖ రాసినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. బదులుగా.. మరుసటి రోజే కిమ్ ప్రత్యుత్తరం రాసినట్లు పేర్కొంది. ఇరు దేశాల ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. తన హయాంలో మూన్ చేసిన ప్రయత్నాలను కిమ్ ప్రశంసించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. 'ఇరువురు నేతలు లేఖలు ఇచ్చిపుచ్చుకోవడం వారి మధ్య లోతైన నమ్మకానికి ప్రతీక' అని ప్యాంగ్యాంగ్కు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేఎన్సీఏ) అభిప్రాయపడింది.
అందుకేనా? కొంతకాలంగా రెచ్చగొట్టే చర్యలతో దక్షిణ కొరియా సహా ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది ఉత్తర కొరియా. వరుసగా బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులను జపాన్ సముద్రాల్లోకి ప్రయోగిస్తూ.. ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడికి దైపాక్షిక సంబంధాల గురించి కిమ్.. సానుకూలంగా లేఖ రాయడంపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ కొరియాలో.. మేలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఉత్తర కొరియాపై ఎలాంటి కఠిన చర్యలకు ఉపక్రమించొద్దన్న ఆలోచనతోనే కిమ్ ఇలా చేశారేమోనని నిపుణులు అంటున్నారు. ఇది కొత్త ప్రభుత్వాన్ని ముందే నీరుగార్చే ప్రయత్నం చేయడానికేనని అభిప్రాయపడుతున్నారు.