Kim Jong Un Meets Vladimir Putin :ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు బహిరంగంగా మద్దతునిచ్చారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. 'దుష్ట శక్తులను శిక్షించే పోరాటంలో.. రష్యా విజయం సాధిస్తుంది' అని అన్నారు. రష్యా తన సార్వభౌమాధికారం, దేశ భద్రతను కాపాడుకోడానికి ఆధిపత్య శక్తులకు వ్యక్తిరేకంగా నిలబడిందని కితాబిచ్చారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ తన మనసులోని మాటలను పంచుకున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరు దేశాధినేతలు రష్యాలోని వాస్టోచ్నీ కాస్మోడ్రోమ్ రాకెట్ ప్రయోగ కేంద్రంలో బుధవారం భేటీ అయ్యారు.
రష్యా వైపే న్యాయం ఉంది! : కిమ్ జోంగ్ ఉన్
ఈ సమావేశానికి ముందు ఇరువురు నేతలు సోయుజ్-2 .. రాకెట్ ఫెసిలిటీని సందర్శించారు. ఆ సమయంలో ఉత్తరకొరియా అంతరిక్ష, రక్షణరంగ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. భేటీలో.. ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని విస్తరించడంపైనే 4 నుంచి 5 గంటలు చర్చలు జరిగాయని సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి న్యాయమైందేనని కిమ్ అన్నారు. మాస్కో తన భద్రతా ప్రయోజనాలు కాపాడుకునేందుకే యుద్ధం చేస్తోందని చెప్పారు. ఆధిపత్య శక్తుల సామ్రాజ్యవాద వ్యతిరేక ఫ్రంట్‌కు ఉత్తరకొరియా బేషరతుగా మద్దతిస్తుందన్నారు.
కిమ్ రాక మాకు సంతోషం : పుతిన్
కిమ్ తమ దేశానికి రావడం సంతోషంగా ఉందని పుతిన్ అన్నారు. ఆర్థిక సహకారం, మానవతా సమస్యలతో పాటు తమ ప్రాంతాల పరిస్థితులపై ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు వివరించారు. సైనిక సహకారం గురించి తాము తర్వాత చెబుతామని.. అందుకు చాలా సమయం ఉందని పుతిన్ వెల్లడించారు.
చర్చల అనంతరం ఇరు దేశాల అధినేతలు విందులో పాల్గొన్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ విందులో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, విదేశాంగమంత్రి సెర్వీ లావ్రోవ్‌లతో పాటు కిమ్‌తో పాటు వచ్చిన అధికారులు హాజరయ్యారు.