Kerala Israel Police :ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ కేరళలోని ఓ టెక్స్టైల్ కంపెనీ ఇజ్రాయెల్ పోలీసుల కోసం నిరంతరం పనిచేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది. కన్నూర్ జిల్లాలోని ఓ ఊరికి చెందిన వందలాది టైలర్లు గత ఎనిమిదేళ్లుగా ఇజ్రాయెల్ పోలీసులకు యూనిఫామ్‌లను కుట్టి పంపుతున్నారు.
ప్రపంచ దేశాలకూ..
కేరళలోని కన్నూర్ జిల్లా చేనేత దుస్తుల తయారీ, జౌళీ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో మర్యాన్ అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పరిశ్రమను 2006లో ఇడుక్కి జిల్లాకు చెందిన థామస్ ఒలిక్కల్ అనే వ్యాపారి ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన పోలీసులు, ఆర్మీ సిబ్బంది, భద్రతా దళాలు, ఆరోగ్య సేవల సిబ్బందికి యూనిఫామ్‌లను కుట్టి పంపిస్తోంది. అలా గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పోలీసుల కోసం కూడా ప్రత్యేకంగా యూనిఫామ్‌లు కుట్టి ఎగుమతి చేస్తోంది. కేవలం భద్రతా దళాలకు చెందిన యూనిఫామ్‌లనే కాకుండా స్కూల్ యూనిఫామ్‌లు, సూపర్‌మార్కెట్ స్టాఫ్ యూనిఫామ్‌లు, డాక్టర్ కోర్టులు, కార్పొరేట్ యూనిఫామ్‌లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది.
ఏటా లక్ష యూనిఫామ్‌లు..
మర్యాన్ అప్పారెల్ సంస్థ గురించి తెలుసుకున్న ఇజ్రాయెల్ పోలీసులు 2015లో యజమాని థామస్‌ను కలిశారు. తమ పోలీసుల కోసం యూనిఫామ్‌లు కావాలని ఇజ్రాయెల్ పోలీసుల ప్రతినిధులు ముంబయి వచ్చి మరీ కంపెనీతో చర్చలు జరిపారు. అనంతరం యూనిఫామ్‌ల కోసం భారీగా ఆర్డర్ ఇచ్చారు. అలా అప్పటి నుంచి ఏటా లక్ష యూనిఫామ్‌లను మర్యాన్ అప్పారెల్ ఇజ్రాయెల్ పోలీసులకు సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత కూడా తమకు ఇజ్రాయెల్ పోలీసుల నుంచి పెద్ద ఎత్తున్న ఆర్డర్లు వస్తున్నాయని థామస్ తెలిపారు.