కెన్యాకు చెందిన ఓ పాస్టర్ స్థలంలో 39 మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. మరణం ప్రాప్తించే వరకు ఉపవాసం ఉండాలని తన అనుచరులను కోరిన కేసులో పాస్టర్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన స్థలాల్లో సోదాలు నిర్వహించగా.. 39 మృతదేహాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. ఉపవాసం ఉంటూ అత్యంత నీరస స్థితికి చేరుకున్న మరికొంత మందిని గుర్తించినట్లు చెప్పారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని మలింది సబ్ కౌంటీ పోలీస్ చీఫ్ జాన్ కెంబోయ్ వెల్లడించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 43కు చేరిందని వివరించారు. పాస్టర్ స్థలంలో మరిన్ని సమాధులు తవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.
భగవంతుడి కోసం ఉపవాసం ఉండాలని అనుచరులకు పిలుపునిచ్చిన కేసులో పాల్ మెకెంజీ అనే పాస్టర్‌ను ఏప్రిల్ 14న పోలీసులు అరెస్ట్ చేశారు. మెకెంజీకి చెందిన స్థలాలతో పాటు ఆయన ప్రార్థనలు చేసే గుడ్‌న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్‌లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో చర్చ్‌ను తనిఖీ చేశారు. అక్కడ కృశించిన స్థితిలో 15 మందిని గుర్తించారు. ఇందులో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జీసస్‌ను కలుసుకునేందుకు పాస్టర్ సూచనతోనే ఉపవాసం చేస్తున్నామని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం.
మృతదేహాలను వాహనంలోకి ఎక్కిస్తున్న సిబ్బంది పాస్టర్ నిరాహార దీక్ష
ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మెకెంజీని న్యాయస్థానంలో హాజరుపర్చారు పోలీసులు. ఆయన్ను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే మెకంజీ పొలంలో శుక్రవారం తవ్వకాలు ప్రారంభించారు పోలీసులు. అక్కడ అనేక సమాధులు ఉన్నాయని చెప్పారు. తన అరెస్టుకు నిరసనగా పాస్టర్.. పోలీస్ కస్టడీలోనే నిరాహార దీక్ష చేస్తున్నారు.
మెకంజీ గతంలోనూ అరెస్టయ్యారు. 2019లో ఓసారి, ఈ ఏడాది మార్చ్‌లో మరోసారి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మృతికి సంబంధించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. రెండుసార్లు ఆయన బాండ్‌పై విడుదలయ్యారు. కోర్టుల్లో ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. ఈసారి ఆయన్ను బయటకు విడుదల చేయకూడదని స్థానిక రాజకీయ నేతలు న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నారు. లేదంటే మాలింది ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతాయని అంటున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలల అస్థిపంజరాలు.. పోప్ క్షమాపణ
కెనడాలోని క్రైస్తవ మిషనరీలు నిర్వహించే పాఠశాలల్లో 300కు పైగా చిన్నారుల అస్థిపంజరాలు కనిపించడం సైతం గతంలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలోనే బాలల హత్యాకాండ జరిగిందని వాదనలు వినిపించాయి. అనంతరం పోప్ ఫ్రాన్సిస్ కెనడాలో పర్యటించి క్షమాపణలు చెప్పారు.