World's oldest woman dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించిన కేన్ తనాకా(119) కన్నుమూసింది. జపాన్‌లోని ఫుకౌకాలో ఏప్రిల్ 19న ఆమె తుది శ్వాస విడిచినట్లు అక్కడి అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ వార్త ఎంతో బాధ కలిగించిందని ఫుకౌకా గవర్నర్ సీతారో హత్తోరి విచారం వ్యక్తం చేశారు.
కేక్ తింటున్న కేన్ తనాకా కేన్ తనాకా ఫుకౌకాలో 1903 జనవరి 2న జన్మించింది. 1922లో హిడియో తనాకా అనే వ్యక్తిని పెళ్లాడింది. నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తనాకా దంపతులు మరొకరిని దత్తత తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఫుకౌకాలో నూడుల్స్ షాప్ నడిపేవారు. కేన్ తనాకా భర్త, పెద్ద కుమారుడు.. 1937లో చైనా-జపాన్ యుద్ధంలో పాల్గొన్నారు.
డ్రింక్ తాగుతున్న కేన్ తనాకా Kane Tanaka died: 2019లో 116 ఏళ్ల వయసులో కేన్ తనాకాను ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ. 2020లో 117 ఏళ్ల 261 రోజుల వయసుతో జపాన్‌లోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 119వ పుట్టినరోజు జరుపుకుంది. ఆమె 120వ జన్మదినం కూడా జరుపుకుంటుందని అప్పట్లో తనాకా కుటుంబసభ్యులు విశ్వాసం వ్యక్తంచేశారు. 2021లో జరిగిన చైనా ఒలింపిక్స్‌లో చక్రాల కుర్చీలో కూర్చునే టార్చ్ రిలేలో పాల్గొనాలని తనాకా ఆశపడింది. అయితే.. కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.
119వ పుట్టినరోజు వేడుకల్లో తనాకా ఈమధ్య కాలం వరకు కూడా తనాకా పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. రోజూ ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచేదని వెల్లడించారు. మధ్యాహ్నం గణితం, క్యాలిగ్రఫీ సాధన చేస్తూ గడిపేదని చెప్పారు. ఒథెల్లో అనే బోర్డ్ గేమ్ ఆడడంలో తనాకా సిద్ధహస్తురాలని, ఆమె అందరినీ ఓడించేదని గుర్తుచేసుకున్నారు.