తెలంగాణ

telangana

ETV Bharat / international

'కాళీ' దర్శకురాలి పోస్టుపై ట్విట్టర్‌ కొరడా.. కెనడా మ్యూజియం క్షమాపణలు - కాళీ వివాదం

Kaali poster controversy: కాళీ సినిమా పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ట్విట్టర్‌ చర్యలు చేపట్టింది. ఆ పోస్టును భారత్​లో కనిపించకుండా చేసింది. మరోవైపు, ఈ పోస్టర్​ను విడుదల చేసిన అగాఖాన్‌ మ్యూజియం క్షమాపణలు చెప్పింది.

Kaali poster controversy
Kaali poster controversy

By

Published : Jul 7, 2022, 7:31 AM IST

Kaali poster controversy: మలయాళీ దర్శకురాలు లీనా మణిమేగలై విడుదల చేసిన 'కాళీ' పోస్టర్‌ దేశంలో తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. దేవతా మూర్తిని అవమానించేలా ఉన్న ఆ పోస్టర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మైక్రోబ్లాగింగ్‌ వేదిక ట్విట్టర్ చర్యలు చేపట్టింది. జులై 2న మణిమేగలై పెట్టిన కాళీ పోస్టర్‌ను భారత్​లో కనిపించకుండా చేసింది. భారత్ నుంచి వచ్చిన న్యాయపరమైన డిమాండ్ల ప్రకారం ట్వీట్​పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదులపై దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మణిమేగలైపై కేసులు నమోదయ్యాయి.

క్షమాపణ చెప్పిన అగా ఖాన్‌ మ్యూజియం..
ఈ వ్యవహారాన్ని కెనడాలోని భారతీయ హైకమిషన్‌ కూడా తీవ్రంగా పరిగణించింది. రెచ్చ గొట్టేవిధంగా ఉన్న మెటీరియల్‌ను వెంటనే తొలగించాలని కెనడా అధికారులతోపాటు కార్యక్రమ నిర్వాహకులకు సూచించింది. దీనిపై స్పందించిన అగా ఖాన్‌ మ్యూజియం.. మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. తాజా పరిణామానికి చింతిస్తున్నామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎంపీపై కేసు
మరోవైపు ఇదే పోస్టరుకు సంబంధించి.. మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఆమెను అరెస్టు చేయాలని భాజపా నేతలు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన చేపట్టారు. వెంటనే ఆమెను తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు.

వివాదం ఇదీ...
తమిళనాడు మధురైకి చెందిన లీనా మణిమేగలై.. 'రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా'లో భాగంగా 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటో ఉన్న అగాఖాన్‌ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ ఫొటోను దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో దేవతామూర్తి సిగరెట్‌ తాగుతూ ఉండడం, బ్యాక్‌గ్రౌండ్‌లో స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా అటు కెనడాలోని హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details