Justin Trudeau Statement On India :ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోమరోసారి పాతరాగమే అందుకున్నారు. హర్దీప్ సింగ్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయంపై విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్‌తో కెనడా పంచుకుందని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలను జస్టిన్ ట్రూడోమరింత పెంచారు.
'ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ హత్య గురించి సోమవారం నేను మాట్లాడిన విషయానికి సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని కొన్ని వారాల క్రితమే భారత్‌కు అందించాం. ఈ విషయంలో మేం భారత్‌తో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తీవ్రమైన అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్.. మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం' అని ట్రూడో అన్నారు.
అమెరికా స్పందన..
India Canada Conflict : మరోవైపు.. భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లేవనెత్తిన ఆరోపణలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. కెనడాతో వివాదంపై అమెరికా నేరుగా భారత్‌తో సంప్రదించిందని వెల్లడించారు. 'ఈ వివాదంలో జవాబుదారీతనాన్ని అమెరికా చూడాలనుకుంటోంది. కెనడాతో భారత్ కలిసి పనిచేస్తోందని ఆశిస్తున్నాం' అని బ్లింకెన్ అన్నారు.