తెలంగాణ

telangana

ETV Bharat / international

నెలరోజుల నాటకానికి తెర.. 'రుణ పరిమితి పెంపు' చట్టంపై బైడెన్ సంతకం - అమెరికా డేట్​ సీలింగ్ అంటే ఏమిటి

US Debt Ceiling Bill : అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే బిల్లుపై సెనెట్​ ఆమోదం తెలిపిన రెండు రోజుల్లోనే చట్టంపై సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్. డెమొక్రాటిక్, రిపబ్లికన్ నాయకుల పరస్పర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. బైడెన్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు.

US Debt Ceiling Bill
US Debt Ceiling Bill

By

Published : Jun 4, 2023, 7:48 AM IST

Updated : Jun 4, 2023, 8:46 AM IST

US Debt Ceiling Bill : అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. స్వదేశ, విదేశాలలో ఆర్థిక మార్కెట్‌లను అశాంతికి గురిచేసిన నెలరోజుల నాటకానికి తెరదించారు. డెమొక్రాటిక్, రిపబ్లికన్ నాయకుల పరస్పర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. బైడెన్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి అమెరికాలో నగదు కొరత ఏర్పడుతుందని.. అది అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందని అంతకుముందు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.

2021 నాటికి అమెరికా ప్రభుత్వం​ తీసుకున్న అప్పు.. 28.5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.23,53,09,680 కోట్లు) చేరింది. ఇది అమెరికా జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించిందే. దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ​ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేసేందుకు.. బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరింది. కానీ, ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు.. అప్పు పరిమితి పెంచేందుకు తొలుత ససేమిరా అన్నారు. దీంతో గతకొంత కాలంగా కాస్త ఆందోళన నెలకొంది. అనంతరం వీరంతా ఓ ఒప్పందానికి వచ్చి.. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 314- 117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 165-46 ఓట్ల తేడాతో డెమొక్రాట్‌లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు మద్దతు ఇచ్చారు.

డెట్​ సీలింగ్​ అంటే ఏమిటి..?
what is debt ceiling : చెల్లింపుల కోసం అమెరికా ప్రభుత్వం​ తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే 'డెట్‌ సీలింగ్‌' అంటారు. అంటే ఈ పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు వీలులేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, మెడికేర్‌, సామాజిక భద్రత, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రీఫండ్‌లు.. ఇలా అన్ని ఖర్చులు ఈ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి. కాగా మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ​ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం.. ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదన్నమాట. బైడెన్​ ప్రభుత్వం​ జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. అమెరికా ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తూ వచ్చింది.

ఇవీ చదవండి :బైడెన్‌ సర్కార్​కు ఊరట.. అప్పుల పరిమితి పెంపునకు అంతా రెడీ!

దివాలా గండం నుంచి గట్టెక్కిన అమెరికా.. 'రుణ పరిమితి పెంపు బిల్లు' పాస్

Last Updated : Jun 4, 2023, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details