Joe Biden India Tour Complete : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం జీ20 సమావేశాలు ముగించుకుని నేరుగా వియత్నాంకు బయలుదేరారు.
శనివారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు బైడెన్ హాజరయ్యారు. అనంతరం సదస్సును ముగించుకుని ఆదివారం ఉదయం వియత్నాం పయనమయ్యారు. అంతకుముందు దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మా గాంధీ సమాధికి.. మిగతా జీ20 నేతలు, ప్రధాని మోదీతో కలిసి నివాళులు అర్పించారు బైడెన్.
Modi Biden Bilateral Talks : జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం భారత్‌కు వచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బైడెన్‌తో భేటీతో ఫలప్రదంగా జరిగిందని.. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై చర్చించినట్లు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు మోదీ. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..
White House Joint Statement India : చర్చల అనంతరం అమెరికా, భారత్ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆవిష్కరణల్లో సహకారంతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సైబర్ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.