Joe Biden Convoy Hit By Unknown Car :అమెరికా అధ్యక్షుడు కాన్వాయ్‌లోని ఒక భద్రతా వాహనాన్ని ఓ గుర్తుతెలియని ప్రైవేటు కారు ఢీకొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు విస్తృత సన్నాహాలు చేసుకుంటున్న బైడెన్, ఆదివారం రాత్రి డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో తన ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అధ్యక్ష దంపతులు వారితోనే విందు చేసిన తర్వాత తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఒక కారు అధ్యక్షుడి కాన్వాయ్‌లోని పార్క్ చేసి ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారుల కారును ఢీకొట్టింది. తర్వాత కూడా అదే మార్గంలో వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించగా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయుధాలతో అతడి కారును చుట్టుముట్టారు. డ్రైవర్‌ను కిందకు దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో తిరిగి వెళ్లేందుకు జిల్ బైడెన్, కాన్వాయ్‌లోని వాహనంలో కూర్చోగా జో బైడెన్ కూర్చునేందుకు వెళుతున్నారు. కారు ఢీకొట్టిన శబ్దం విని బైడెన్ ఆశ్చర్యంతో అటువైపు చూశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జో బైడెన్‌ను సురక్షితంగా అక్కడి నుంచి అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు.
కేవలం 130 అడుగుల దూరంలో
అధ్యక్ష దంపతుల షెడ్యూల్‌కు, కారు ఢీకొట్టిన ఘటన ఎలాంటి ఆటంకం కలిగించలేదని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన సమయంలో జిల్ బైడెన్ కూర్చున్న అధ్యక్ష వాహనానికి కేవలం 130 అడుగుల దూరంలోనే బైడెన్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.