Jil Biden Tests Coronavirus Positive : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కరోనా బారినపడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. అయితే, ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె డెలావెర్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ తమ ప్రకటనలో తెలిపింది. కాగా.. భార్య జిల్ బైడెన్‌కు పాజిటివ్ అని తెలియగానే అధ్యక్షుడు జో బైడెన్ కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్ పెర్రీ వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనకు వైరస్ నెగెటివ్‌గానే నిర్ధరణ అయినట్లు చెప్పారు. అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరీక్షించి ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు చేయనున్నారని తెలిపారు.
Biden Visit : అంతకుముందు గత శనివారం బైడెన్ దంపతులు ఫ్లోరిడాలోని హరికేన్ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వీరిద్దరూ డెలావెర్‌లోని బీచ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బైడెన్ సోమవారం ఫిలడెల్ఫియాలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. కానీ, జిల్ బైడెన్ మాత్రం డెలావెర్‌లోనే ఉండిపోయారు. అక్కడే ఆమె స్వల్ప అనారోగ్యానికి గురవడం వల్ల పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
అధ్యక్షుడిపై భారత పర్యటనపై సస్పెన్స్
Biden G20 : మరోవైపు, భారత్ అధ్యక్షతన దిల్లీ వేదికగా సెప్టెంబరు 9-10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ హాజరు కావాల్సి ఉంది. ఆయన గురువారం భారత్ పర్యటనకు బయల్దేరుతారని అగ్రరాజ్యం ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి సమయంలో జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల అధ్యక్షుడి దిల్లీ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అయితే, పర్యటన రద్దు గురించి వైట్‌హౌస్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బైడెన్ దిల్లీ రాక ఖాయమనే అనిపిస్తోంది.