తెలంగాణ

telangana

ETV Bharat / international

వంద రోజుల భరోసా.. ప్రసంగాలతో స్ఫూర్తి నింపుతున్న జెలెన్​స్కీ

ZELENSKY 100 SPEECHES: రష్యా దండయాత్రకు పాల్పడిన రోజు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. ప్రసంగాలతో తన దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ ఉన్నారు. జనం మధ్యలోనే ఉన్నానని ఈ ప్రసంగాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. రష్యా యుద్ధం ప్రారంభించి వందరోజులు దాటగా.. ఆయన ప్రసంగాల సంఖ్య సైతం 100కు చేరింది.

JELENSKY 100 SPEECHES
JELENSKY 100 SPEECHES

By

Published : Jun 5, 2022, 6:48 AM IST

Zelensky war speeches:"రష్యా 100 రోజుల క్రితం మాపై దండెత్తినప్పుడు.. మా దేశం ఇంతకాలం పాటు ఎదురొడ్డి పోరాడుతుందని ఎవరూ ఊహించలేదు" ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా చెప్పిన మాటలివి. "ప్రపంచ దేశాల నాయకులు నన్ను దేశం విడిచి పొమ్మని చెప్పారు.. అయితే ఉక్రెయిన్‌ ప్రజలు ఎంతటి సాహసికులో, స్వేచ్ఛాప్రియులో వారు గ్రహించలేకపోయారు" యుద్ధం 50వ రోజున ఏప్రిల్‌లో ఆయన చేసిన ప్రసంగ సారాంశం ఇది. రష్యా యుద్ధం ఆరంభించిన రోజు నుంచీ జెలెన్‌స్కీ తనను తాను నిరూపించుకుంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ.. ఎన్నో దేశాలను ఆకట్టుకుంటూ.. ముందుకు సాగుతూనే ఉన్నారు. సినీ, టీవీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ప్రకాశించిన జెలెన్‌స్కీ ఈ 100 రోజుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో ప్రతి రాత్రి ఒక వీడియో ప్రసంగం చొప్పున విడుదల చేస్తూ తన ప్రజల్లో స్వేచ్ఛానురక్తి ఆరకుండా ప్రజ్వలింపజేస్తున్నారు. ఆ వీడియో ప్రసంగాల సంఖ్య ఆదివారానికి 100కు చేరడం విశేషం. తాను అస్త్రసన్యాసం చేసి దేశం నుంచి పరారు కాలేదని.. జనం మధ్యనే ఉన్నానని ఆ ప్రసంగాలతో ఆయన భరోసా ఇస్తున్నారు.

రష్యా యుద్ధం ప్రారంభించిన ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం

భావోద్వేగభరిత సంభాషణలు...
నటుడిగా సంభాషణలను భావోద్వేగభరితంగా పలకగలిగే జెలెన్‌స్కీ తన ప్రసంగాల్లోనూ ఆ లక్షణాన్ని ప్రతిఫలిస్తున్నారు. రష్యన్‌ సైనికుల దారుణాలను ఆవేశంగా ఖండిస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేస్తూ ప్రజల్లో పోరాట దీక్షను పెంచుతున్నారు. గతంలో అమాయకంగా కనిపించిన వదనం నేడు గడ్డం పెంచి గాంభీర్యాన్ని.. మొక్కవోని స్థైర్యాన్నీ పలికిస్తోంది. నిద్రలేక ఉబ్బిపోయిన కళ్లు నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రకరకాల వస్త్రధారణతో ఇప్పుడే యుద్ధ రంగం నుంచి వచ్చినట్లు కనిపిస్తున్నారు. తలవంచని ధీరుడి కీర్తిని కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవడానికి వీడియో లింకు ద్వారా ఐక్యరాజ్య సమితిలో, బ్రిటిష్‌ పార్లమెంటులో, అమెరికా కాంగ్రెస్‌లో, మరెన్నో దేశాల పార్లమెంట్లలోనూ ప్రసంగించారు. ఫ్రాన్స్‌లో కేన్స్‌ చలనచిత్రోత్సవం, అమెరికాలో గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలోనూ వీడియో ప్రసంగాలే చేశారు. కీవ్‌ నగరంలో ఒక సొరంగ మార్గంలో పాత్రికేయులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన దేశ పౌరులతో ప్రతి రాత్రీ వీడియోలో సంభాషిస్తూ ధైర్య స్థైర్యాలను పెంపొందిస్తున్నారు.

జూన్ 3న జెలెన్​స్కీ ప్రసంగం

శాంతి, విజయం, ఉక్రెయిన్‌...
రష్యన్ల దాడుల్లో అమాయక పౌరులు మరణించడం చూసి తన హృదయం క్షోభిస్తోందని ఉద్వేగంగా ప్రకటిస్తున్నారు. తమ ధాటికి కొద్ది రోజుల్లోనే ఉక్రయిన్‌ కుప్పకూలుతుందని రష్యన్లు పెట్టుకున్న ఆశ వమ్మయిందంటే.. అందుకు కారణం ఎదురునిలిచి పోరాడాలని ఉక్రెయిన్‌ ప్రజలు తీసుకున్న దృఢ నిర్ణయమేనని జెలెన్‌స్కీ చాటుతున్నారు. యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి చేసిన ప్రసంగంలో జెలెన్‌స్కీ మూడు పదాలే ముఖ్యమని నొక్కి చెప్పారు. అవి శాంతి, విజయం, ఉక్రెయిన్‌. 2019లో జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలపలేదు. కారణమేమిటని ప్రశ్నించగా 'తెర మీద పాత్రకూ నిజజీవిత పాత్రకూ చాలా తేడా ఉంది. దేశ బాధ్యతలను తీసుకునే సత్తా తనకుందని ఆయన నిరూపించుకోవాలి' అని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

వంద రోజుల స్పీచ్​లకు సంబంధించిన చిత్రాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details